రాజకీయ నాయకులకు వాస్తవాలు రుచించవు. కాసేపట్లో ఓడిపోతామని తెలిసినా.. ఆహా ఓహో అనే వారినే పక్కనపెట్టుకుంటారు. ఎదుటివాడు ఎంత గొప్పపని చేసినా మనస్ఫూర్తిగా అభినందించలేని పిరికిబాపతు వారంతా. శివసేన నాయకుల విషయంలో ఇది మరోసారి రుజువైంది. కరోనా కష్టకాలంలో వలస కూలీలకు నటుడు సోనూ సూద్ చేసిన సేవల్ని దేశమంతా ప్రశంసించింది.
కోట్ల రూపాయలు ఖర్చుపెట్టలేకపోవచ్చు కానీ, నేనున్నాననే ఓ భరోసా ఇచ్చారాయన. ముఖ్యంగా సొంతూళ్లకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న మహిళలను ఆదుకున్నాడు. వారి కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశాడు, రైల్ టికెట్లు కొన్నాడు, విమాన ప్రయాణానికి కూడా ఏర్పాట్లు చేశాడు. రోజూ వేలమంది అభాగ్యులకు అన్నం పెట్టాడు. హాస్పిటల్, పారామెడికల్ సిబ్బంది కోసం ఏకంగా తన స్టార్ హోటల్ ను ఇచ్చేశాడు. ఇలా లాక్ డౌన్ టైమ్ లో సోనూ సూద్ చేయని సహాయం లేదు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హీరో అయిపోయాడు ఈ ప్రతినాయకుడు.
మహారాష్ట్రలో సోనూసూద్ పేరు మారుమోగిపోతుండే సరికి.. అధికార శివసేనకు సహజంగానే కడుపుమంట మొదలైంది. ఏకంగా ఆ రాష్ట్ర గవర్నర్ సైతం సోనూసూద్ ని రాజ్ భవన్ కి పిలిపించి ప్రశంసించేసరికి శివసైనికులు మరింతగా రగిలిపోయారు. తాజాగా సోనూ సూద్ ని గేలి చేస్తూ ఆ పార్టీ పత్రిక సామ్నాలో ఓ వ్యాసం రాశారు. దీన్ని బట్టి వారి జలసీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
లాక్ డౌన్ లో కొత్త మహాత్మ ఉద్భవించారంటూ శివసేన నేత సంజయ్ రౌత్ సామ్నాలో ఓ వ్యాసం రాశారు. మహారాష్ట్రలో శివసేనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోటే సోనూ సూద్ కి బీజేపీ మద్దతుగా నిలిచి ఈ పనులన్నీ చేయించిందని, లేకపోతే లాక్ డౌన్ కాలంలో కూడా ఆయనకి ప్రత్యేక బస్సులు ఎలా దొరికాయని లాజిక్ తీశారు. త్వరలోనే సోనూ సూద్ బీజేపీ తరపున ప్రచారం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆరోపించారు. అంతే కాదు ఎవరో స్వచ్ఛంద సంస్థ సేకరించిన విరాళాలతో సోనూసూద్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కూడా నోరు పారేసుకున్నారు.
పోనీ అలాగే అనుకుందాం.. కనీసం సోనూసూద్ ఆ పని అయినా చేశారు, అధికారంలో ఉండి శివసేన నేతలు ఏం చేశారని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. అమ్మ పెట్టదు, అడుక్కు తిననియ్యదు అనే సామెత శివసేనకు కరెక్ట్ గా సూట్ అవుతుందని అంటున్నారు నెటిజన్లు.
ఇప్పటికే దేశంలో కరోనా కల్లోలిత ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకున్న మహారాష్ట్రలో, వైరస్ ను అరికట్టడంలో, లాక్ డౌన్ ను సజావుగా అమలు చేయడంలో శివసేన సర్కారు ఘోరంగా ఫెయిలైంది. దానికి తోడు ఇప్పుడు పెద్ద మనసుతో ఛారిటీ కార్యక్రమలు నిర్వహిస్తున్న సోనూ సూద్ ను విమర్శించి, ఉన్న పరువును కూడా పోగొట్టుకుంది శివసేన.