ప్రేయసి కోసం వెళ్లాడు.. ప్రాణాలు కోల్పోయాడు

ఓవైపు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జోరుగా సాగుతున్నప్పటికీ.. మరోవైపు పరువు హత్యలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ కొంతమంది పరువు-ప్రతిష్ట అంటూ పాకులాడుతూ నిండు ప్రాణాల్ని బలితీసుకుంటున్నారు. మూర్ఖంగా ఆలోచించి హంతకులుగా మారుతున్నారు.…

ఓవైపు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జోరుగా సాగుతున్నప్పటికీ.. మరోవైపు పరువు హత్యలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ కొంతమంది పరువు-ప్రతిష్ట అంటూ పాకులాడుతూ నిండు ప్రాణాల్ని బలితీసుకుంటున్నారు. మూర్ఖంగా ఆలోచించి హంతకులుగా మారుతున్నారు. తాజాగా తమిళనాడులోని చిదంబరంలో జరిగిన పరువు హత్య స్థానికంగా కలకలం రేపింది.

చిదంబరంలో ఓ కిరాణా షాపు నడుపుకునే అంబళగన్.. అదే గల్లీలో ఉన్న శ్వేతను ప్రేమించాడు. శ్వేతకు కూడా అంబళగన్ అంటే ఇష్టమే. ఇద్దరూ దాదాపు ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. అయితే లాక్ డౌన్ తో ప్రేయసిని చూడడం కుదరలేదు అంబళగన్ కు. అందుకే 3 రోజుల కిందట శ్వేత ఉన్న వీధిలోకి వెళ్లాడు. కానీ ఆమె తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. వాళ్ల చేతిలో దెబ్బలు కూడా తిన్నాడు.

అయితే ఈసారి శ్వేత ఇంట్లో ఎవరూ లేరన్న సమాచారంతో మరోసారి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే అతడు ఊహించినట్టు జరగలేదు. ఇంట్లో శ్వేతతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు కూడా ఉన్నారు. ఇంట్లోకి వచ్చిన అంబళగన్ ను చూసి వాళ్లు తట్టుకోలేకపోయారు. వీధిలో తమ పరువు పోతుందని భావించి, అక్కడికక్కడే అతడ్ని నరికి చంపేశారు.

తమ పరువును మంటగలిపేలా ప్రవర్తించాడనే కోపంతోనే అంబళగన్ ను చంపేసినట్టు లేఖ రాసి మరీ శ్వేతతో పాటు ఆ కుటుంబం పరారైంది. రంగంలోకి దిగిన పోలీసులు లేఖను స్వాధీనం చేసుకున్నారు. శ్వేతతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరుడిపై కేసులు నమోదుచేశారు. ప్రస్తుతం వాళ్లంతా పరారీలో ఉన్నారు.

ఇన్ని పనులు చేసిన ముఖ్యమంత్రిని చూడలేదు