జమ్మూ కాశ్మీర్ లో పౌరులు ఎవరు? శాశ్వత నివాసులు ఎవరు?
ఈ విషయాలను ఇక మీద భారతదేశపు పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఆశ్చర్యం అనిపిస్తున్నా ఇప్పటిదాకా అలాంటి పరిస్థితి లేదు. ఇక మీదట భారత దేశపు పార్లమెంటు చేసే ప్రతి చట్టం కూడా.. జమ్మూ కాశ్మీర్ లో అమలవుతుంది. ప్రధానంగా పౌరసత్వం విషయంలో జమ్మూ కాశ్మీరీలకు… అక్కడి రాజకీయ పార్టీలకు ఎలాంటి కొమ్ములు మొలిచాయని అంతా అనుకుంటూ ఉన్నారో.. ఆ కొమ్ములను మోడీ సర్కారు మొదలంటా విరిచేసింది.
ఆర్టికల్ 370 అనేది ఏ రకంగా అయితే కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తుందో.. అలాగే 35ఎ అనేది అక్కడి పౌరసత్వాన్ని నిర్దేశిస్తుంది. ఇదివరకే చెప్పుకున్నట్లుగా… కాశ్మీరీ అమ్మాయి దేశంలోని మరే ఇతర ప్రాంతానికి చెందిన అబ్బాయిని పెళ్లిచేసుకున్నా.. ఆమె పౌరసత్వం రద్దవుతుంది. అదే సమయంలో పాకిస్తాన్ యువకుడు కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గనుక… అతడికి ఇక్కడ పౌరసత్వం లభిస్తుంది అనేది కూడా చెప్పుకున్నాం.
నిజానికి ఇలాంటి నిర్ణయం వచ్చినందుకు జమ్మూ కాశ్మీరేతర.. భారతీయ ముస్లిం సమాజం హర్షించాలి. ఈ నిర్ణయానికి జై కొట్టాలి. ఇన్నాళ్ల పాటూ ఆర్టికల్ 35 ఎ ద్వారా జమ్మూ కాశ్మీర్ లో ఏ ప్రత్యేకహక్కులైతే ఉన్నాయో… అవన్నీ.. భారతీయ ముస్లిం సమాజాన్ని అవమానపరిచే అంశాలు అని వారు తెలుసుకోవాలి. అంటే జమ్మూ కాశ్మీర్ లో కేవలం ముస్లింలు మాత్రమే ఉంటారని కాదు. కానీ మెజారిటీ వారు ఉంటారని భావించినప్పుడు… భారతీయ ముస్లింలు ఎవ్వరూ వారిని పెళ్లి చేసుకుని పౌరసత్వం పొందలేరు.. అదే సమయంలో పాకిస్తానీ ముస్లిం మాత్రం పెళ్లి ద్వారా పౌరసత్వం పొందగలడు అనే చట్టంలోని ఏర్పాటు మనదేశంలోని ఇతర ప్రాంతాల వారికి అవమానకరమైన నిర్ణయం.
మోదీ సర్కారు.. యావద్దేశంలోని ప్రజలకు, ప్రధానంగా ముస్లింలకు జరుగుతున్న ఈ అవమానాన్ని సమూలంగా తుడిచిపెట్టేసింది. కశ్మీర్ ఇప్పుడు మన సోదర ప్రాంతం. మనం దేశంలోని అన్ని ఇతర ప్రాంతాల వారితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండగలమో.. అలాంటి సంబంధ బాంధవ్యాలనే అక్కడి వారితో కూడా కలిగి ఉండగలం. అందుకు ఇక్కడి ముస్లిం సమాజం హర్షించాలి అనే పాయింట్ ను అందరూ గుర్తించాలి.