ఆర్టికల్ 370ని, ఆర్టికల్ 35ఎ ను రద్దు చేస్తూ మోదా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సమర్థించింది. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి.. రాజ్యసభలో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సాహసోపేతమైనదిగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్రమోదీని, హోం మంత్రి అమిత్ షాను ఆయన ప్రత్యేకంగా అబినందించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కాశ్మీర్ లో ఇవాళ ఇలాంటి దుస్థితి నెలకొనడానికి కారణభూతమైనందుకు కాంగ్రెస్ పార్టీ మీద నిశిత విమర్శలు గుప్పించారు. నెహ్రూ అలాంటి లోపభూయిష్టమైన ఒప్పందం చేసుకోకుండా ఉన్నట్లయితే, అప్పటి చరిత్రలోని వాస్తవాల ప్రకారం.. పాకిస్తాన్ లోకి సుమారు 25 కిలోమీటర్ల దూరం చొచ్చుకు వెళ్లిపోయిన భారత సైనిక బలగాలను నెహ్రూ బలవంతంగా వెనక్కి పిలిపించకుండా ఉన్నట్లయితే… హరిసింగ్, షేక్ అబ్దుల్లాలతో అసమంజసమైన ఒప్పందాలు చేసుకోకుండా ఉన్నట్లయితే… ఇవాళ ఈ సభలో ఇలాంటి బిల్లు గురించి చర్చించాల్సిన అవసరమే వచ్చేది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
370 అధికరణం వల్ల జమ్మూ కాశ్మీరు ప్రాంతంలో ఎలాంటి అవ్యవస్థ నెలకొని ఉన్నదో అంశాలవారీగా విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. గత అరవై అయిదు సంవత్సరాలుగా.. అక్కడి పరిస్థితుల గురించి తతిమ్మా దేశ ప్రజలందరూ ఏదైతే కోరుకుంటున్నారో.. అలాంటి నిర్ణయం ఇవాళ వచ్చిందని కూడా విజయసాయిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపం వల్లనే.. ఇలాంటి దుస్థితి వచ్చిందని అన్నారు.
మొత్తానికి రాజకీయంగా తమ కూటమికి సంబంధం లేని ఇతర పార్టీలను కూడా ఈ బిల్లు పొందినట్లు అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ తలాక్ బిల్లును కూడా పాక్షికంగా మాత్రమే సమర్థించింది. కానీ.. 370 రద్దు నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తూ… మోడీని, అమిత్ షాను సాహసోపేతమైన నాయకులుగా అభివర్ణించడం విశేషం.