అప్పుడు డిమాండు చేయలేదేం బాబూ!

ఈ బాబు.. చంద్రబాబు కాదు! ఆ పార్టీలో ఆయనను మించిన బాబూ రాజేంద్రప్రసాద్! ఆయన తాజాగా ప్రభుత్వం ఎదుట కొత్త డిమాండు పెట్టారు. స్థానిక సంస్థలకు జరగాల్సిన ఎన్నికలను తక్షణం నిర్వహించేయాలని అంటున్నారు. పైగా…

ఈ బాబు.. చంద్రబాబు కాదు! ఆ పార్టీలో ఆయనను మించిన బాబూ రాజేంద్రప్రసాద్! ఆయన తాజాగా ప్రభుత్వం ఎదుట కొత్త డిమాండు పెట్టారు. స్థానిక సంస్థలకు జరగాల్సిన ఎన్నికలను తక్షణం నిర్వహించేయాలని అంటున్నారు. పైగా జడ్పీ, మండల ఛైర్మన్లకు కూడా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలంటూ కొత్త డిమాండును కూడా ప్రభుత్వం ఎదుటకు తెస్తున్నాడు.

ఆశ్చర్యం ఏంటంటే.. సర్పంచిగా ప్రస్థానం ప్రారంభించి, రాష్ట్ర సర్పంచుల సంఘానికి అధ్యక్షపదవిని కూడా వెలగబెట్టిన ఈ బాబుకు, తెలుగుదేశం పాలనలో ఉన్న అయిదేళ్ల కాలంలో స్థానిక ఎన్నికలను తక్షణం నిర్వహించడం గురించి గానీ, అధ్యక్ష పదవులకు ప్రత్యక్ష ఎన్నికలే పెట్టడం గురించి గానీ.. ఎందుకు ఆలోచన కలగలేదనేదే!

తెలుగుదేశం పార్టీ ఏలుబడి సాగిస్తున్నప్పుడు ఆగస్టు 2వ తేదీనాటికే సర్పంచుల పదవీకాలం అయిపోయింది. అప్పటినుంచి ఎన్నికలు నిర్వహించడానికి ధైర్యం లేకుండా రకరకాల సాకులు చెబుతూ పార్టీ వాటిని వాయిదా వేస్తూ వచ్చింది. ప్రత్యేకాధికారుల పాలనతోనే వ్యవహారాలను నడిపిస్తున్నది.

ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఆ పార్టీని ప్రజలు గద్దె దించేసిన తర్వాత.. వైకాపా ప్రభుత్వం వచ్చాక జులైలో మొదటి వారంలో జడ్పీ, మండల, మునిసిపల్ పదవుల పదవీకాలం ముగిసింది. అవన్నీ కూడా ఖాళీ అయ్యాయి.

ఆ పదవులకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేయడానికి అప్పుడే ఎన్నికల సంఘం సంబంధిత అధికార్లతో సమావేశాలు నిర్వహించి కసరత్తు చేస్తోంది. ఈ లోగానే బాబూ రాజేంద్ర ప్రసాద్.. పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డిని కలిసి.. గ్రామాల్లో పాలన అస్తవ్యస్తం అయిపోయిందని తక్షణం ఎన్నికలు పెట్టాలని అంటున్నారు.

మరి గత ఏడాదిగా సర్పంచి పోస్టులు ఖాళీ ఉంటే తమ అధినేతకు చెప్పకుండా ఆయన ఏం చేస్తున్నారో అర్థం కాదు.

జడ్పీ,మండల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలనే డిమాండ్ కూడా చిత్రమే. గత అయిదేళ్లలో వారి వద్ద అధికారం ఉన్నప్పుడు ఆ మాటే ఎత్తకుండా.. ఇప్పుడు ఎందుకు అలాంటి డిమాండ్లు వినిపిస్తున్నారో, హడావిడి చేస్తున్నారో అర్థం కావడం లేదు.