ఏ పార్టీతో కలసి పనిచేసినా లౌకిక వాదాన్ని వీడను అంటూ.. బీజేపీపై తనకున్న ప్రేమను వ్యక్తపరచిన పవన్ కల్యాణ్ మెల్లగా తన స్వరం మార్చుతున్నారు.
ప్రత్యేక హోదా అనే పేరు వినగానే అంతెత్తున ఎగిరిపడే జనసేనాని.. ఇప్పుడు చిలక పలుకులు వల్లె వేస్తున్నారు. ఎంతసేపు నేను పోరాడితే ఏమొస్తుంది, నాతో పాటు ప్రజలు కూడా ప్రత్యేక హోదా కావాలని అడగాలి అంటున్నారు.
అంతే కాదు, తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే బలమైన కోరిక ఉంది కాబట్టే నూతన రాష్ట్రం ఏర్పడిందని, కానీ ఏపీ ప్రజల్లో అంత భావోద్వేగం లేదని దెప్పిపొడిచారు.
ప్రజల్లో కోరిక లేనప్పుడు నేను మాత్రం ఎంతకాలం పోరాడేది, ఎంతసేపని హోదాపై మాట్లాడేది అంటూ చెప్పుకొచ్చారు పవన్. ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యాయం అంటూ ఏపీ బీజేపీ నేతలు చెబుతున్న మాటలకే పవన్ కూడా వంత పాడినట్టు అనిపిస్తుంది.
ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకుని తానొక్కడినే ఏదో చేసేస్తానంటూ, కేంద్రం మెడలు వంచుతానంటూ బీరాలు పలికారు పవన్ కల్యాణ్. స్పెషల్ ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలంటూ సెటైర్లు వేసి కేంద్రానికి సవాళ్లు విసిరిన పవన్ ఇప్పుడు పూర్తిగా చప్పబడిపోయారు.
ఎన్నికల తర్వాత, అందులోనూ బీజేపీతో స్నేహం చేసే ఆలోచన వచ్చాక వవన్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదాపై నోరు మెదపకుండా.. ఆ తప్పుని ప్రజలపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పవన్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తానంటే కాదనేవారు ఎవరుంటారు. జనసేన కార్యకర్తలు, సామాన్య ప్రజలు అందరూ వెంటొస్తారు. కానీ ఆయన మాత్రం ఎవరూ చెప్పకుండానే అస్త్ర సన్యాయం చేసేశారు. ఆ తప్పుని మాత్రం ప్రజలపైకి నెట్టేశారు.
ఆర్టికల్ 370 రద్దుపై కూడా పవన్ తనదైన శైలిలో స్పందించారు. దేశ సమగ్రత అనే అంశం వచ్చినప్పుడు రెండో ఆలోచన ఉండకూడదని, మనమంతా దేశం కోసం ముందుండాలని అన్నారు. జమ్మూకాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొంటే మంచిదేకదా అన్నారు.
మొత్తమ్మీద పవన్ కల్యాణ్ మెల్లమెల్లగా కమలం దారిలోకి వస్తున్నట్టు అర్థమవుతోంది. మంచి ముహూర్తం ఒక్కటే మిగిలిందేమో.