జమ్మూకాశ్మీర్‌లో సంబరాలు.. నిరసనలు.!

ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం సహజమే. ఆ ఉద్రిక్త పరిస్థితుల నడుమ, సంబరాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కాశ్మీర్‌ పండిట్లు, రాష్ట్ర విభజనను స్వాగతిస్తున్నారు. మరీ ముఖ్యంగా లడ్డాఖ్‌ ప్రాంతంలో…

ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం సహజమే. ఆ ఉద్రిక్త పరిస్థితుల నడుమ, సంబరాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కాశ్మీర్‌ పండిట్లు, రాష్ట్ర విభజనను స్వాగతిస్తున్నారు. మరీ ముఖ్యంగా లడ్డాఖ్‌ ప్రాంతంలో కొన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో మునిగి తేలుతున్నారు. చాలాకాలంలో లడ్డాఖ్‌ ప్రాంతంలో హిందువులు, బౌద్ధులు విభజనను కోరుకుంటోన్న విషయం విదితమే. వాళ్ళంతా ఇప్పుడు మోడీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. 

నిజానికి కాశ్మీర్‌ లోయలో ఒకప్పుడు పండిట్లు ఎక్కువగా వుండేవారు. వీరిపై తీవ్రవాదులు, అల్లరి మూకల అఘాయిత్యాల కారణంగా, పండిట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. తీవ్రవాదుల ఒత్తిళ్ళను తట్టుకోలేక, కొందరు పండిట్లు ఇస్లాంలోకి మారిపోయిన సందర్భాలూ లేకపోలేదు. దోపిడీలు, హత్యలు, అత్యాచారాలకు గురైన కాశ్మీరీ పండిట్లు.. దాదాపు ఏడు దశాబ్దాల పాటు నరకాన్ని అనుభవించామనీ, ఇప్పుడు తమకు స్వేచ్ఛ లభించిందనీ అంటున్నారు. 

జమ్మూకాశ్మీర్‌ని మినహాయిస్తే, దేశంలో ఏ ఇతర రాష్ట్రం.. ఆర్టికల్‌ 370 రద్దుని వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజానీకం, నరేంద్ర మోడీ సర్కార్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవకముందే, జమ్మూకాశ్మీర్‌పై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మోడీని అభినందిస్తూ.. సోషల్‌ మీడియాలో ట్వీట్లు పోటెత్తుతున్నాయి. 

మరోపక్క, పాకిస్తాన్‌ నుంచి మోడీ సర్కార్‌ తీరుపై నిరసన వెల్లువెత్తడం సహజమే. జమ్మూకాశ్మీర్‌ తమదిగా చెప్పుకునే పాకిస్తాన్‌, కాశ్మీరీలకు మద్దతు పేరుతో సోషల్‌ మీడియాలో విషం చిమ్ముతోంది. కాశ్మీరీల హక్కుల్ని భారతదేశం కాలరాస్తోందంటూ పాకిస్తాన్‌కి చెందిన నెటిజన్లు గగ్గోలు పెడుతోంటే, వారికి ధీటుగా భారత నెటిజన్లు ఎదురుదాడికి దిగుతున్నారు. 

ఇదిలా వుంటే, జమ్మూకాశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు విషయమై న్యాయపరమైన చిక్కులేమీ వుండవని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. అయితే, కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం షరామామూలుగానే, కాశ్మీరీల హక్కుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద వుందని అంటున్నారు.