ఎన్నికల ముందు వరకు మోడీ సర్కారు అంటే కారాలు మిరియాలు నూరుతూ.. దేశం మొత్తాన్ని సర్వభ్రష్టత్వం చేసేస్తున్నారన్నట్లుగా చెలరేగిపోయిన చంద్రబాబునాయుడు అండ్ కో తమ అవకాశవాద వైఖరిని స్పష్టంగానే ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఫలితాల తర్వాత మోడీ పట్ల చంద్రబాబు కాస్త మెత్తబడ్డారు. చాన్సు వస్తే మళ్లీ బంధం ముడిపెట్టుకోవాలని చూస్తున్నారు. తాజాగా రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లుకు కూడా పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తూ ప్రసంగించారు. అయితే టీవీ డిస్కషన్లలో మాత్రం తెదేపా ప్రతినిధులు మోడీ ప్రభుత్వ చర్యను చేతగానితనంగా దెప్పిపొడుస్తూ తమ తెంపరితనాన్ని బయటపెట్టుకున్నారు.
మొత్తానికి తెలుగుదేశం పార్టీ తమకు బాగా అలవాటు అయిన రెండు నాలుకల ధోరణినే ఇప్పటికీ అనుసరిస్తూ వస్తోంది. రాష్ట్ర విభజన గురించిన పోరాటం జరిగినంత కాలమూ చంద్రబాబునాయుడు తన వైఖరి ఏమిటో బయటపెట్టకుండా.. రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజల్ని వంచించడానికి పూనుకుని.. తెలంగాణలో ఆ పార్టీని సర్వనాశనం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా పదేపదే యూటర్న్ లు తీసుకుంటూ తనకు రెండునాలుకల పద్ధతే ఇష్టం అని పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు.
తాజాగా ఆర్టికల్ 370 రద్దు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాత్రం సభలో మాట్లాడుతూ ఎడాపెడా మోడీ సర్కారును పొగిడేశారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని ఆయన అన్నారు. కశ్మీరీ ప్రజలు ఆరవయ్కేళ్లుగా పడిన కష్టాలేవీ ఇక ఉండవని కూడా జోస్యం చెప్పారు. అమిత్ షాకు ప్రత్యేకంగా అభినందనలు కూడా చెప్పారు.
అయితే అదే పార్టీ తరఫున టీవీ చర్చల్లో పాల్గొన్న జూపూడి ప్రభాకర్ మాత్రం ఎడాపెడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకిపారేశారు. ఒకవైపు నిర్ణయం మంచిదని అంటూనే.. మోడీ సర్కారు చేతగానితనం ధోరణిలో ఈ బిల్లు తెచ్చిందని అన్నారు. జూపూడి మరీ అర్థరహితంగా, నవ్వులపాలయ్యేలా మాట్లాడడం విశేషం. జమ్మూ కాశ్మీర్ లో మిలిటరీ బలగాలను మోహరించకుండానే బిల్లును తెచ్చి ఉండాల్సిందని.. అల్లర్లు జరిగితే అప్పుడు చూసుకోవాలని, అల్లర్లు జరిగే పరిస్థితి ఉన్నదంటే.. వ్యతిరేకత ఉన్నదన్నట్లే కదా అని.. రకరకాలుగా ఆయన మాట్లాడారు. మొత్తానికి మోడీ సర్కారుకు వ్యతిరేకంగా గళం వినిపించారు.
కాగా, అమెరికానుంచి వచ్చిన తర్వాత కూడా ప్రజలు, మీడియా ముందుకు ఇప్పటిదాకా రాకుండా కొడుకులాగానే ట్వీట్లతో రోజులు నెట్టేస్తున్న చంద్రబాబునాయుడు కూడా.. కేంద్రానికి మద్దతిస్తున్నామని ట్వీటడం విశేషం. తన నోటితో స్వాగతిస్తూ.. తన వారితో టీవీల్లో తిట్టిస్తూ రెండు నాలకలు ప్రదర్శించడం చంద్రబాబుకే చెల్లిందని అంతా అనుకుంటున్నారు.