మీరు ఎన్నారైయా? ఎన్నారై కాకపోయినా మీరు ఒక ఊరిలో భూములుంచుకుని వేరే ఊరిలోగాని, రాష్ట్రంలోగాని నివసిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీ భూములకి కాపరులు లేరన్న వాస్తవాన్ని గ్రహించండి. ఇది ఏదో ఒక రాష్ట్రానికో, ప్రాంతానికో సంబంధించిన అంశం కాదు. భారతదేశం మొత్తానికి ఇది వర్తిస్తుంది.
రాజకీయం రంగు మారింది. కానీ దాని పోకడ మారలేదు. కాస్త వివరంగా చెప్పుకుందాం.
ఎమ్మెల్యేలన్నా, ఎంపీలన్నా సగటు మనిషి దృష్టిలో అవినీతిపరులే. ఎందుకంటే కేవలం ప్రభుత్వమిచ్చే జీతంతో బతికే మనుషుల్లాగ వాళ్లెప్పుడూ కనపడరు. వెనుకున్న మందీమార్బలాన్ని పోషించడానికి, వచ్చిపోయేవాళ్లకి టీలు కాఫీలు ఇవ్వడానికి, పైన అధిష్టానం చెప్పినట్టుగా పార్టీ ఫండ్ సేకరించి ఇవ్వడానికి, తాము తదుపరి ఎన్నికల్లో గెలవడం కోసం ప్రచారానికి ..ఇలా ప్రతిదానికి డబ్బు కావాలి. అది కూడా కాస్తో కూస్తో కాదు. చాలా కావాలి. దానిని సంపాదించడానికి వక్రమార్గాలు అన్వేషించక తప్పదు. ఎందుకంటే ఎలా చూసుకున్నా రుజుమార్గంలో ఆ సంపాదన సాధ్యమయ్యే పని కాదు.
ఏ వ్యాపారికో ఏ కర్మాగారం పెట్టుకోవడానికో లైసెన్సులు ఇప్పించి లాంఛనం అడగాలి. అడిగితే లంచమంటారు. అడక్కపోతే అవసరం తీరదు. వ్యాపారే అర్థం చేసుకుని ఎంతో కొంత ముట్టజెబుతాడు. అయినా అన్ని ప్రాంతాల్లోనూ వ్యాపారాలు, కర్మాగారాలు నిత్యం వచ్చేయవు.
కానీ నిరంతరం కనిపించేవి, కాస్త కాలో చేయో పెడితే డబ్బులు రాల్చేవి రియలెస్టేట్ సెటిల్మెంట్లు. అందరూ ఇవి ఉద్దేశ్యపూర్వకంగా చేసినా చేయకపోయినా ఒక్కోసారి డబ్బు కోసం కాకపోయినా రాజకీయం కోసం చూసీ చూడనట్టు వ్యవహరించి అధర్మం వైపు మొగ్గే పరిస్థితులు ఉంటున్నాయి.
దీనిని ఈ మధ్యన నిజంగా జరిగిన ఒక సంఘటనతో చెప్పుకుందాం.
ఒక మారుమూల తెలుగు గ్రామంలో ఒక వ్యక్తి పేరున ఎకరం స్థలముంది. ఎప్పుడో 1981లో రూ 15,000 కి కొన్న స్థలమది. ఆ వ్యక్తి గతించి పదేళ్లయ్యింది. ఆయన సంతానం అమెరికాలో ఒకరు, పూనెలో ఒకరు, హైదరాబాదులో ఒకరు స్థిరపడ్డారు. ముగ్గురూ ఆ గ్రామంలో ఓటర్లు కాదు. వారి చుట్టాలు కూడా ఆ ఊరిలో ఎవరూ లేరు. ఆ స్థలం విలువ ప్రస్తుతం రూ 10 కోట్లు.
సంతానం ముగ్గురూ దానినీ అమ్ముకుని పంచుకుంటే పన్నులు పోను తలొక రూ 3 కోట్లు మిగలొచ్చు అనే ఉద్దేశ్యంతో ఆ సంతానం ఆ ఊరిలో దిగారు. కానీ ఆ స్థలం కబ్జా అయింది. అందులో ఎవరో చిన్న ఇల్లు వేసుకుని పొజిషన్ తీసేసుకున్నారు. ఆ మొత్తం స్థలం తమదేనంటూ నకిలీ పత్రాలేవో చూపించారు.
ఈ ముగ్గురూ అమెరికాలోని తమ మిత్రులద్వారా ఏవో లింకులు కదిపి ఎవర్నో పట్టుకుని మొత్తానికి లోకల్ ఎమ్మెల్యే వరకు వెళ్లారు.
ఆ ఎమ్మెల్యే చక్కగా మాట్లాడి ఇలా చెప్పాడు- “చూడండి. మీ ముగ్గురూ బాగానే స్థిరపడ్డారు. దాదాపు నలభై ఏళ్లుగా ఆ స్థాలన్ని అసలు మీరు పట్టించుకోనే లేదు. మీరిక్కడ ఓటర్లు కాదిప్పుడు. స్థలం న్యాయంగా మీదే. నేను కాదనను. కానీ దానిని కబ్జా చేసినవాడు కులం రిత్యా, వాడి వెనుకున్న ఓటర్ల రిత్యా నాకు అవసరం. నాకు ఎమ్మెల్యేగా ఒకటే ధ్యేయం. మళ్లీ గెలవడం. కనుక నేను మీ పక్షాన నిలబడి, ఇక్కడ ఓడి నా పైనున్న అధిష్టానం ముందు తెల్లమొహం వెయ్యలేను. ఇంతకీ ఆ కబ్జా చేసినవాడు చెప్పేది ఒక్కటే. మొత్తం కాకుండా, 1981 లో మీ నాన్నగారు 15,000 బ్యాంకులో వేసుంటే ఇప్పటికి అది మెచ్యూర్ అయ్యుంటే ఎంత వచ్చేదో అంతా ఇస్తానంటున్నాడు. అది కూడా 10% వడ్డీకి. అంత వడ్డీ నిజానికి ఏ బ్యాంకూ ఇవ్వదు, అది తీసుకుని వెళ్లిపోమంటున్నాడు. లేదంటే కోర్టుకి వెళ్లి తేల్చుకోమంటున్నాడు. మీకది సమ్మతమేనా?”.
ఇదంతా విని ఆ ముగ్గురూ మాట్లాడుకుని ఎమ్మెల్యేతో- “మరీ అంత తక్కువైతే ఎలా? అది ఎలా న్యాయం చేసినట్టవుతుంది? మా రాకపోకల ఖర్చులే సరిపోవు. పైగా కోర్టంటే ఈ జన్మకి తేలదు. దాని కోసం తరచూ ఖర్చు పెట్టాలి, తిరగాలి, పోరాడాలి. కనుక మరో మాట చెప్పండి”, అన్నారు.
చివరిగా ఎమ్మెల్యే ఆ కబ్జాదారుడిని పిలిపించి, కాస్త గట్టిగా మాట్లాడి ఈ ముగ్గురికీ తలొక పదిహేను లక్షలు చొప్పున మొత్తం రూ.45 లక్షలు ఇప్పించి పంపారు.
అసలు పోయేకన్నా, బ్యాంకు వడ్డీ లెక్క కన్నా ఇది చాలా నయమని, ఇలా న్యాయం చేసిన ఎమ్మెల్యే ధర్మప్రభువు అనుకుని ఆ ముగ్గురూ వెళ్లిపోయారు.
ఇలాంటి కథలు నిత్యం జరుగుతున్నాయి. స్థలం ఎకరమైనా, 150 గజాలైనా ఇదే తంతు. స్థానికులు కాకపోతే స్థలం మీద ఆశలు వదిలేసుకోవడమే. ఎప్పుడో పెరిగితే అమ్ముకుందామనుకునేది కలే. ఉన్న స్థలంలో ఉన్నపళంగా పర్మిషన్స్ తెచ్చుకుని ఇల్లు కట్టుకుని ఆస్తి పన్ను కడుతూ అద్దెకిచ్చుకుంటే చాలావరకు సేఫ్. అప్పుడైనా తరచూ చూసుకుంటూ ఉండాలి. లేదా ఉన్న రేటుకి ఎవరికైనా అమ్మేయడం శ్రేయస్కరం.
ప్రస్తుతం మంచి ఎమ్మెల్యేలంటే స్థానికుల స్థలాల జోలికి రానివాళ్ళు మాత్రమే. పరిస్థితులు అంత దయనీయంగా మారాయి. మరీ ముఖ్యంగా డీటీసీపీ లే ఔట్స్ లేని రోజుల్లో అంటే 2009 కి ముందు కొన్న స్థలాల పరిస్థితంతా ఇలానే ఉంది. ఏ ఏరియా అయినా కాస్త అభివృద్ధికి దగ్గరపడుతోందనగానే కబ్జాలు మొదలైపోతున్నాయి. కబ్జా అయినంత త్వరగా న్యాయం అందదు కనుక ఎక్కడికక్కడ సెటిల్మెంట్ల దందాయే నడుస్తోంది. బలమున్నవాడిదే స్థలం అన్నట్టుంది.
ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్నారైలు, స్థానికేతరులు తమ తమ స్థలాల పరిస్థితిని పరిశీలించుకోగలరు.
– విన్నకోట లక్ష్మీనారాయణ