రాజకీయ రంగంలో, సినిమా రంగంలో ప్రచారాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే విధంగా ఉంటుంది. ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రాజకీయాల్లోనైతే ప్రతి రోజూ అనేక ప్రచారాలు హల్ చల్ చేస్తుంటాయి. ఇది నిజమో కాదో తెలియాలంటే సంబంధిత నాయకులు నోరు విప్పాల్సిందే. తన మీద జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని ఎవరైనా నాయకుడు ప్రకటిస్తాడనుకోండి, కాని అదే ఫైనల్ అని చెప్పలేం. కొంతకాలం తరువాత అదే నిజం కావొచ్చు కూడా. పార్టీ మారనని ఘంటాపథంగా చెప్పే నాయకుడు కొంతకాలం తరువాత అదే నిజం చేస్తాడు. కాబట్టి రాజకీయాల్లో ఏదీ స్థిరంగా ఉంటుందని చెప్పలేం. చాలా కాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది కూడా ఇదే పరిస్థితి. జనసేన పార్టీయే కాదు, పవన్ కూడా ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తరువాత జనసేన ఉంటుందా? ఉండదా? అనే సందేహం చాలామందికి కలిగింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటాడా? సినిమా రంగంలోకి రీఎంట్రీ ఇస్తాడా? అనే డౌటు వచ్చింది.
పవన్ సినిమాల్లోకి తిరిగి రావాలని కోరుకుంటున్నవారు అనేకమంది సినిమా రంగంలోనూ, ఆయన అభిమానుల్లోనూ ఉన్నారనేది వాస్తవం. ఆయన ఎన్నికల్లో ఓడిపోయాడేమోగాని సినిమా హీరోగా ఓడిపోలేదు. ఆయనకున్న క్రేజ్ అటువంటిది. జనసేన కొన్ని స్థానాలైనా సాధించివుంటే ఇన్ని రూమర్లు వచ్చివుండేవి కాదేమో…! వ్యవస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీ భవిష్యత్తే అగమ్యగోచరంగా కనబడుతున్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ జనసేన ఎంత? రాజకీయ పార్టీని నడపడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పార్టీ కోసమైనా పవన్ సినిమాల్లో నటిస్తాడని అనుకున్నారు కొందరు. ఈ ప్రచారం ఇలా కొనసాగుతుండగానే చివరాఖరుగా పవన్ తన ఫైనల్ నిర్ణయం ప్రకటించేశాడు. బహుశా ఇంతకంటే క్లారిటీ ఇక ఉండకపోవచ్చు. జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయనని చాలా స్పష్టంగా ప్రకటించాడు.
'భీమవరం నుంచి మాట ఇస్తున్నా. ఓడిపోయిన, ఓడించబడ్డ నేల నుంచి చెబుతున్నా. జనసేన ఎప్పటివరకు ఉంటుందంటే మీలో నలుగురు నన్ను మోసేవరకు' ….. అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. ఇంత క్లారిటీతో చెప్పాక పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడనేది ఉత్తమాటే అనుకోవాలి. ఒకవేళ సినిమాల్లోకి వెళ్లి బిజీ అయితే అప్పుడు పవన్ చెప్పిన మాటలను జనం గుర్తు చేయకుండా ఉండరు కదా. కాబట్టి ఆయన తన నిర్ణయం నుంచి వెనక్కు తిరగకపోవచ్చు. పవన్ ఇక సినిమాల్లో నటించడని, ఎవరైనా నిర్మాతలు, దర్శకులు మరీ బవవంతం చేస్తే అతిథి పాత్రల్లో నటిస్తాడని సోదరుడు నాగబాబు కొంతకాలం కిందట చెప్పాడు. సినిమాల్లో పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ తన పవర్ రాజకీయాల్లోనే చూపించాలనుకుంటున్నారు. తాను ఆషామాషీగా రాజకీయాల్లోకి రాలేదని, కనీసం పాతికేళ్లపాటు కొనసాగడానికే వచ్చానని అనేకసార్లు చెప్పాడు. అయినప్పటికీ సినిమా రంగంలోకి రీఎంట్రీ ఇస్తాడనే ప్రచారం ఆగకుండా కొనసాగింది.
దీన్ని దృష్టిలో పెట్టుకునే తనను నలుగురు మోసేవరకు జనసేన ఉంటుందని పవన్ ఘాటుగానే చెప్పాడు. జనసేన పార్టీని నడపడానికి ఆయన సినిమాల్లోనే నటించనక్కర్లేదని, తాము వందకోట్లు విరాళంగా ఇస్తామని కొందరు ఎన్ఆర్ఐలు చెప్పినట్లు కొంతకాలం క్రితం ఓ వార్త వచ్చింది. ఇంత అండ ఉన్నప్పుడు పవన్ నిధుల కోసం బాధపడక్కర్లేదు. పార్టీ సభ్యత్వం ద్వారా నిధులు సేకరించవచ్చు. పవన్ తన సినిమా ఇమేజ్ను పార్టీ కోసం సరైన తీరులో ఉపయోగించుకోవడంలేదేమోనని అనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను వ్యతిరేకించేవారు కూడా ఐదేళ్లు ఆయన టీడీపీ ప్రభుత్వంపై అలుపెరుగకుండా పోరాడిన తీరును మెచ్చుకున్నారు. టీడీపీ అనుకూల పత్రిక 'ఆంధ్రజ్యోతి' జగన్పై ఎలాంటి కథనాలు రాసిందో, చంద్రబాబు పాలనను ఎంత ప్రశంసించిందో చూశాం. అలాంటి పత్రిక కూడా వైకాపా గెలిచాక జగన్ పోరాట పటిమను మెచ్చుకుంది. 'పోరాట యోధుడు' అనే శీర్షికతో వేమూరి రాధాకృష్ష 'కొత్త పలుకు' కాలం రాశారు. పవన్ను పోరాట యోధుడు అని ఎవ్వరూ అనలేకపోతున్నారు. బాబు హయాంలో ఆయన వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. తాను బతికి ఉన్నంతవరకు జనసేన బతికే ఉంటుందని ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఓ పోరాట యోధుడిగా మారాలి. వచ్చే ఎన్నికల నాటికైనా జనసేన అధినేత 'జననేత'గా ఎదగాలి.