కొన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ, ఆరెస్సెస్ డిమాండుగా దేశవ్యాప్తంగా అత్యంత వివాదాస్పద సుదీర్ఘ అంశాల్లో ఒకటిగా ఉన్నటువంటి ‘ఆర్టికల్ 370 రద్దు’ లాంఛనం పూర్తయింది.
వరుసగా రెండోసారి ప్రజల మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ నేతృత్వంలోని భాజపా సర్కారు దీనిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
రాజ్యసభలో అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే భారత ప్రభుత్వం ఈ 370 అధికరణాన్ని రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దయింది.
జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు లడాఖ్ ను కూడా కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. చట్టసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ కు మాత్రం అసెంబ్లీ ఉంటుంది.
కేబినెట్ సమావేశం పూర్తికాగానే.. అమిత్ షా సభలో ప్రకటన చేస్తారనే సమాచారం బయటకు వచ్చింది. రాజ్యసభలో తీవ్ర గందరగోళం మధ్య అమిత్ షా ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ కొన్ని విపక్షాలు ఆయన ప్రసంగాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఈ బీభత్సం నడుమనే… అమిత్ షా బిల్లును ప్రవేశ పెడుతూ తన ప్రసంగం పూర్తి చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేశారు. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది.