మంచు కొరడా 2: ‘కాశ్మీరం’ మూడు ముక్కలు!

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ని కాలగర్భంలో కలిపేస్తూ- 370 వ అధికరణాన్ని మోదీ సర్కారు రద్దు చేసేసింది. భారతేశానికి శిఖర భాగంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ను ‘పూర్తిస్థాయిలో’ భారతదేశంలో అంతర్భాగంగా…

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ని కాలగర్భంలో కలిపేస్తూ- 370 వ అధికరణాన్ని మోదీ సర్కారు రద్దు చేసేసింది. భారతేశానికి శిఖర భాగంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ను ‘పూర్తిస్థాయిలో’ భారతదేశంలో అంతర్భాగంగా మార్చివేసింది.

అన్నింటినీ మించి.. నిత్యం ఉద్రిక్తతలకు, ఉగ్రవాదానికి నిలయంగా ముద్రపడుతున్న ఈ ప్రాంతాన్ని మోదీ సర్కారు మూడు ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఇకపై మూడు ముక్కలు అయింది.

జమ్మూ, కాశ్మీర్, లడాఖ్ మూడూ మూడు భాగాలుగా చెలామణీలోకి వస్తాయి. వీటిలో జమ్మూ మరియు కాశ్మీర్ మాత్రం అసెంబ్లీని కూడా కలిగి ఉండే కేంద్ర పాలిత ప్రాంతాలుగా చెలామణీ అవుతాయి.

అదే సమయంలో లడాఖ్.. కేవలం కేంద్ర ప్రభుత్వ పాలన మాత్రమే ఉండే, అసెంబ్లీ లేని ప్రాంతంగా ఉంటుంది. లడాఖ్ ప్రజలు కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాలనే కోరుకుంటున్నట్లుగా హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటించారు.

దీంతో ఆ ప్రాంత ముఖచిత్రం మాత్రమే కాకుండా, అక్కడి సామాజిక, సాంఘిక, భద్రతాపరమైన ప్రజాజీవనం కూడా పూర్తిస్థాయిలో మారిపోయే వాతావరణం కనిపిస్తోంది.

370 అధికరణం జమ్మూకాశ్మీర్ కు అనేక ప్రత్యేకహక్కులను ప్రసాదిస్తుంది. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు (కరెన్సీ) అనే మూడు విభాగాలకు సంబంధించి తప్ప… భారత పార్లమెంటు చేసే ఏ చట్టం కూడా ఈ రాష్ట్రంలో అమల్లోకి రాదు. వారికి దానితో సంబంధం లేదు.

సాధారణంగా 370 అంటే మనకందరికీ తెలిసిన సంగతి ఒక్కటే. భారత పౌరులు ఎవ్వరూ కూడా ఆ ప్రాంతంలో ఆస్తులు కొనుక్కోడానికి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వీల్లేదు. ఇవాళ్టితో అలాంటి ప్రత్యేకప్రతిపత్తి వారికి తొలగిపోయింది.

నిజానికి మనలో చాలా మందికి తెలియని సంగతి ఒకటుంది. కాశ్మీర్ లో పుట్టిపెరిగిన ఒక అమ్మాయి.. సహజంగానే అక్కడ ఆస్తులు కలిగి ఉండవచ్చు. కానీ, భారత్ లోని ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే గనుక.. అక్కడ ఆస్తి కలిగి ఉండే హక్కును ఆమె కోల్పోతుంది.

అయితే ఇంకో తమాషా ఏంటంటే.. పాకిస్తాన్ కు చెందిన కుర్రవాడు కాశ్మీర్ కుచెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం.. వారు అక్కడ ఆస్తులను కలిగి ఉండవచ్చు.

ఇలాంటి ప్రత్యేకఅధికారాలు అన్నింటికీ మోడీ సర్కారు మంగళం పాడేసింది. ఆర్టికల్ 370 ని రద్దు చేసేసింది. ఆ ప్రాంతాన్ని మూడురాష్ట్రాలుగా విభజించింది.