భారత్ కు నచ్చింది, కశ్మీర్ కు నచ్చుతుందా?!

జమ్మూ కశ్మీర్ కు గల ప్రత్యేక అధికరణం 370 రద్దుపై దేశంలో ప్రధానంగా ఒకే స్పందన వ్యక్తం అవుతూ ఉంది. కేంద్రం చాలా మంచి పని చేసిందని.. ఇన్నాళ్లూ జమ్మూ అండ్ కశ్మీర్ కు…

జమ్మూ కశ్మీర్ కు గల ప్రత్యేక అధికరణం 370 రద్దుపై దేశంలో ప్రధానంగా ఒకే స్పందన వ్యక్తం అవుతూ ఉంది. కేంద్రం చాలా మంచి పని చేసిందని.. ఇన్నాళ్లూ జమ్మూ అండ్ కశ్మీర్ కు గల స్వయంప్రతిపత్తి వల్లనే అక్కడ ఉగ్రవాదం తాండవించిందని, విశృంఖలమైన వాతావరణం ఏర్పడిందని అనేక మంది ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగం అని భారత ప్రభుత్వం అనేక సార్లు స్పష్టం చేస్తూ వచ్చింది. అలాంటప్పుడు అక్కడ ప్రత్యేక ప్రతిపత్తి ఎందుకు? అది అవసరం లేదని చాలా మంది సులభంగా తేల్చేస్తూ ఉంటారు.

ఇక మోడీ భక్తులు అయితే ఈ విషయంలో ఊగిపోతూ ఉన్నారు. మోడీ చాలా గొప్ప పని చేశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మిగతా వాళ్లు కూడా ఉన్నట్టుండి దేశభక్తులు అయిపోయారు. కశ్మీర్ మన సొంతం అయ్యిందని అంటున్నారు. మిగతా విషయాల్లో ఏమైనా ఈ విషయంలో మాత్రం మోడీని మెచ్చుకోవాల్సిందే అంటూ కొంతమంది సగటు భక్తులు అంటున్నారు. 

ఇలా మెజారిటీ ఇండియన్లకు జమ్మూ అండ్ కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా సమంజసంగా, అభినందనీయంగా అనిపిస్తూ ఉన్నాయి. కొందరు ఈ నిర్ణయాలపై అత్యుత్సాహపడుతూ ఉన్నారు కూడా. మరి ఇండియా సంగతి సరే, ఇంతకీ జమ్మూ కశ్మర్ సంగతేమిటి? స్వయంప్రతిపత్తి  రద్దు పట్ల కశ్మీరీలు ఎలా రియాక్ట్ అవుతారు? ఈ నిర్ణయం విషయంలో స్థానికుల అభిప్రాయాలతో పని లేదా? వారి విషయంలో నిర్ణయాలను ఢిల్లీలో కూర్చుని తేల్చేయొచ్చా? అనేది బాగా ఆలోచించి, కశ్మీరీల రియాక్షన్ ను గమనిస్తే కానీ తెలియని అంశం. ఈ నిర్ణయం కశ్మీరీలకు నచ్చుతుందా? నచ్చాల్సిన పని లేదా?

ఈ సందర్భంలో తెలుగు వాళ్లకు ఒక అంశాన్ని గుర్తు చేయాలి. రాష్ట్ర విభజన అంశం గురించి ఢిల్లీలో కూర్చుని కొంతమంది నిర్ణయం తీసుకుంటే.. అప్పుడు సీమాంధ్రులు ఎలా స్పందించారు? తమ ప్రమేయం లేకుండా, తమ అభీష్టానికి వ్యతిరేకంగా విభజన జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇప్పటికీ విభజన పట్ల సగటు సీమాంధ్రులు ఎలా స్పందిస్తారు? బహుశా ఇప్పుడు కశ్మీరీలు కూడా అలాగే స్పందించవచ్చు. 

కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదా, చెడ్డదా.. అనే విషయంపై ఇక్కడ తీర్పు ఇవ్వడం లేదు. తమకు స్వతంత్రం లేదు అని కశ్మీరీలు ఫీలవుతూ ఉన్నారు. ఇటీవలే ఆ విషయాన్ని కశ్మీర్ గవర్నర్ కూడా ధ్రువీకరించారు. తను ఒక శాలువా కొనడానికి వెళితే, శాలువాలు అమ్మే వ్యక్తి తనను ఆ ప్రశ్నవేశాడని జమ్మూ అండ్ కశ్మీర్ గవర్నర్ చెప్పాడు. 'మాకు స్వతంత్రం ఎప్పుడొస్తుంది?' అని తనను శాలువాలు అమ్మే ఆ కశ్మీరీ అడిగాడు అని జమ్మూ అండ్ కశ్మీర్ గవర్నర్ ఇటీవలే ప్రకటించారు.

అందుకు తను ఇచ్చిన సమాధానాన్ని కూడా ఆయన ఉటంకించారు. ఆ సమాధానం ఏదైనప్పటికీ, ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కశ్మీరీలు ఎలా స్పందిస్తారనే.. ప్రశ్నకు సమాధానం గవర్నర్ కు ఆ శాలువాలు అమ్మే వ్యక్తి వేసిన ప్రశ్నలో ఉంది!