మనమంతా వేమన శతకం, సుమతి శతకం, భాస్కర శతకం తదితర నీతి సంబంధ పద్యాలు, వాటి భావాలను శ్రద్ధగా చదు వుతూ, వింటూ, నేర్చుకుంటూ పెరిగిన వాళ్లమే. చదువుకు అసలు సిసలు అర్థం పరమార్థం అందులోనే రుచి చూశాం. సుమతీ శతకాల్లోని ఓ పద్యాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం.
అక్కరకు రాని చుట్టము..మొక్కినా వరమీని వేల్పు మోహరమునదా ..నెక్కిన బారని గుర్రము..గక్కున విడువంగవలయు గదరా సుమతీ!
దీని అర్థం ఏంటంటే…ఓ సుమతీ! అవసరానికి పనికి రాని చుట్టం, నమస్కరించి వేడుకున్నా కోరిన నెరవేర్చని భగవంతుడు , యుద్ధ సమయాన ఎక్కినపుడు ముందుకు పరుగెత్తని గుర్రాన్ని విడిచి పెట్టాలనే గొప్ప సందేశాన్ని నాలుగు ముక్కల్లో సుమతీ శతకం వివరించింది. ఈ పద్యం నుంచి నేర్చుకున్న వాళ్లకు నేర్చుకున్నంతగా అర్థమవుతుంది.
ఇక ప్రస్తుతానికి వస్తే సుమతి, వేమనల స్థానంలో మహాజ్ఞానవంతుడైన ఆర్‌కే అనే జర్నలిస్టు పితామహుడు పుట్టుకొచ్చాడు. ఈయన వారం వారం “కొత్తపలుకు” అనే కాలమ్ కింద సమాజాన్ని మేల్కొలిపే కథనాలు రాస్తుంటారు. ఈయన రాతలు చదివితే కోటలు దాటుతాయి. చేతలు చూస్తే గడప కూడా దాటవు.
కరోనా విపత్తునే తీసుకుందాం. మార్చి చివరి వారంలో ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. దీంతో వారం రోజులకే తన పత్రిక, ఏబీఎన్ చానల్ భారీ నష్టాల బాట పట్టిందని ఉద్యోగుల వేతనాల్లో 25 నుంచి 40 శాతం వరకు కోత విధించి తానెంత అమానవీయంగా వ్యవహరించగలడో నిరూపించాడు.
అంతేకాదు, 30 శాతం మంది ఉద్యోగులను నిర్దాక్షణ్యంగా తొలగించి బతుకులను బజారున పడేశాడు. గత నెల నుంచి ఉద్యోగులకు ప్రతి నెలా అందజేసే ఫ్రీ కాపీలను కూడా కట్ చేశాడు. అంటే ఉద్యోగుల చెమటతో తయారయ్యే పత్రికను ఉచితంగా పొందలేని దుస్థితిని ఆర్‌కే కల్పించాడన్న మాట.
ఇక ప్రస్తుతానికి వస్తే ఈనాడు పత్రిక స్ఫూర్తితో మరోసారి కోత విధించిన వేతనాల్లో మరోమారు 10 శాతం కోత విధించినట్టు ఆ పత్రిక ఉద్యోగుల నుంచి అందుతున్న సమాచారం. ఉద్యోగులకు మరో నాలుగు రోజుల్లో వేతనాలు అందనున్నాయి. అప్పటికి కచ్చితమైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈనాడులో ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం కోత విధించేందుకు యాజమాన్యం నిర్ణయించిన విషయం తెలిసిందే.
అయితే ఈనాడు లాంటి పెద్ద సంస్థే 30 శాతం కోత విధిస్తున్నప్పుడు, చిన్న సంస్థ అయిన తాము కోత విధించడంలో తప్పేం ఉందని ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఆలోచించి, ఆ దిశగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అది కూడా ఈ నెల నుంచే అమలు చేసేందుకు కసరత్తు పూర్తి చేసినట్టు తెలిసింది. గోరుచుట్టుపై రోకటి పోటు అనే చందంగా అసలు అంతంత మాత్రం వచ్చే జీతాల్లో 25 శాతం కోతతో అమాంతం పడిపోయిన వేతనాల్లో…మళ్లీ కోత అంటే తామే బావిలో దూకాలని ఆంధ్రజ్యోతి ఉద్యోగులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.
రానున్న కాలంలో తమనే నెలనెలా జీతం ఇవ్వాలనే కండీషన్ పెట్టేట్టున్నారనే సెటైర్స్ ఆంధ్రజ్యోతి ఉద్యోగులు వేస్తున్నారు. నీతులు చెప్పేందుకే తప్ప ఆచరించేందుకు కాదని తమ ఎండీ ఆర్‌కే వ్యవహార శైలి ఉందని ఆంధ్రజ్యోతి ఉద్యోగులు మండిపడుతున్నారు.
మనం మొదట్లో సుమతీ శతకంలో చెప్పుకున్నట్టు…అక్కరకు రాని ఆంధ్రజ్యోతి, కోత విధించవద్దని వేడుకున్నా వినని ఆర్‌కే, కరోనా లాంటి విపత్తులో అమానవీయంగా రోడ్డున పడేసిన జర్నలిజాన్ని విడిచి పెట్టాలనే సందేశం ఈ ఎపిసోడ్‌తో అర్థం కావడం లేదా?