దేశంలో నమోదవుతున్న కరోనా వైరస్ కేసుల్లో మూడో వంతు వాటాను కొనసాగిస్తూ ఉంది మహారాష్ట్ర. దేశంలో లక్ష కేసులు నమోదైనప్పుడు 33 వేలకు పైగా కేసులను కలిగిన ఆ రాష్ట్రం, దేశంలో రెండు లక్షలా నలభై వేల కేసుల సమయానికి దాదాపు 80 వేలకు పైగా కేసుతో మూడో వంతు వాటాను కలిగి ఉంది. కరోనా నివారణలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ విఫలం అయ్యిందో కానీ.. అక్కడ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉన్నాయి. మొదట్లోనే పరిస్థితి అదుపు తప్పడంతో అదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నట్టుంది.
ఇక తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ ఈ మూడు రాష్ట్రాలూ కలిసి మరో 30 శాతం కేసులను కలిగి ఉన్నాయి. వీటిల్లో దాదాపు 75 వేల స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇలా అరవై శాతం కేసులు నాలుగు రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయి.
ఇక పదివేల స్థాయి కేసులున్న ఇతర రాష్ట్రాలతో కలిపితే.. మొత్తం పది రాష్ట్రాల్లోనే దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో 84 శాతం ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ఇండియాలో నమోదైన కరోనా వైరస్ కారణ మరణాల్లో 95 శాతం కూడా పది రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని తెలుస్తోంది. కొత్త కేసుల పెరుగుదలలోనూ, ఈ రాష్ట్రాలే ముందున్నాయి. మొదటి నుంచి కాస్త జాగ్రత్తగా వ్యవహరించిన రాష్ట్రాల్లో కరోనా విజృంభణ నియంత్రణలోనే ఉన్నట్టుంది పరిస్థితి.