వచ్చే ఎన్నికల్లో అధికారానికి రావడం అంత ఈజీనా ?

రాజకీయ నాయకులు అతిశయోక్తిగా, ఆడంబరంగా, గొప్పగా మాట్లాడుతుంటారు. తామే సర్వ శక్తి సంపన్నులమన్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు. తాము చెప్పేదాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారనేది వారికి అనవసరం. తాము చెప్పాల్సింది చెప్పుకుపోతుంటారు. ఈ గిమ్మిక్కులన్నీ సర్వసాధారణం.…

రాజకీయ నాయకులు అతిశయోక్తిగా, ఆడంబరంగా, గొప్పగా మాట్లాడుతుంటారు. తామే సర్వ శక్తి సంపన్నులమన్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు. తాము చెప్పేదాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారనేది వారికి అనవసరం. తాము చెప్పాల్సింది చెప్పుకుపోతుంటారు. ఈ గిమ్మిక్కులన్నీ సర్వసాధారణం. ఇక రాజకీయ నాయకులకు కొన్ని ఊతపదాలుంటాయి.

వాటిల్లో పాపులర్ ఊతపదం వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం అనేది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని తరచుగా చెబుతుంటాయి. ఇప్పుడు ఈ కోవలో కొత్తగా తెలంగాణా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్ షర్మిల కూడా చేరిపోయింది. నిన్న లోటస్ పాండ్ లో తెలంగాణలోని 33 జిల్లాల వైఎస్ అభిమానులతో సమావేశమైన షర్మిల వచ్చే ఎన్నికల్లో అంటే 2023 లో మనదే అధికారమని చెప్పేసింది. తానే ముఖ్యమంత్రిని అవుతానని అన్నది. 

షర్మిల పార్టీ అధికారంలోకి వస్తే సహజంగానే ఆమే ముఖ్యమంత్రి అవుతుంది కదా. ఆలూ లేదు ..చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతలా ఉంది షర్మిల ధోరణి. అసలు పార్టీయే ఇంకా ప్రారంభం కాలేదు. విధి విధానాలు ప్రకటించలేదు. కానీ అధికారంలోకి వచ్చేస్తామని చెబుతోంది. 

ఆమె తీరు చూస్తుంటే మరో నెల రోజుల్లో ఎన్నికలు జరుగుతాయన్నట్లుగా మాట్లాడుతోంది. ఎవరితోనూ పొత్తులు ఉండవని చెప్పింది. టీఆర్‌ఎస్‌ చెబితేనో, బీజేపీ చేబితేనో తాను రాలేదని చెప్పింది. ప్రజల ఆశీర్వాదం దేవుడి అండ ఉన్నాయట.

తెలంగాణా ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని బీజేపీ చెబుతుంటే దానికో అర్ధం ఉంది. సాధారణ ఎన్నికల్లో ఒక స్థానం గెలుచుకున్న బీజేపీ, దుబ్బాక ఉప ఎన్నికలోనూ గెలిచింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యాన్ని ఆడ్డుగోడ కట్టింది. ఈమధ్య కాలంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. 

టీఆర్‌ఎస్‌ కు భయం కలిగించగలిగింది. ఇక కాంగ్రెస్ కు దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని (ఉమ్మడి ఏపీ ) పాలించిన అనుభవం ఉంది. దానికి లీడర్లు ఉన్నారు. కేడర్ ఉంది. తెలంగాణను ఇచ్చింది ఆ పార్టీయే. ప్రజలు టీఆర్‌ఎస్‌ తో విసిగిపోతే ప్రత్యామ్నాయంగా బీజేపీనో, కాంగ్రెస్ నో ఎంపిక చేసుకుంటారు.

ఆ రెండు పార్టీలకు ఓ చరిత్ర ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లోనే అధికారంలోకి రావడానికి షర్మిలకు అర్హతలు ఏమిటి ? బలం ఏమిటి ? ప్రజాదరణ ఏమిటి ? కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టీఆర్‌ఎస్‌ పార్టీని ఢీ కొట్టడానికి చెమటోడుస్తున్నాయి. అలాంటిది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని ప్రచారం చేయగానే షర్మిల పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందా ? ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటున్న టీడీపీ ఎందుకు అధికారంలోకి రావడంలేదు ? ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేరు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఎందుకు అధికారంలోకి రావడంలేదు ? 

పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి వచ్చిన నాయకుడు ఎన్టీఆర్ మాత్రమే. ఆనాటి పరిస్థితులు ఎన్టీఆర్ కు అనుగుణంగా ఉన్నాయి. ఆయనకంటూ సొంత ఇమేజ్ ఉంది. ఆ బలంతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మరి షర్మిల బలం ఏమిటి ? ప్రస్తుతం ఒక్క రాజశేఖర్ రెడ్డి పేరు మాత్రమే. ఆయన కూతురు అన్న ఇమేజ్ ఒక్కటే షర్మిలకు ఉంది. టీఆర్‌ఎస్‌ కు బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఉంది. 

అసలు తన బలమేమిటో చూసుకోకుండా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకొచ్చేది నేనే అంటే ఎలా ? ముందుగా షర్మిల బలమైన నాయకురాలిగా ఎదగాలి. పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉండాలి. తన విధానాలతో, ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకోవాలి. అప్పుడు అధికారంలోకి వస్తుందో రాదో అంచనా వేయవచ్చు.