ప్చ్‌…నిట్టూర్పులే మిగిలాయ్‌!

తాను అధికారంలోకి వ‌స్తే పాల‌న‌లో స‌మూల మార్పులు తీసుకొస్తాన‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌దేప‌దే చెప్పారు. అంతా నిజ‌మే అనుకున్నారు. అధికారంలోకి వ‌చ్చిన కొంత కాలానికే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం…

తాను అధికారంలోకి వ‌స్తే పాల‌న‌లో స‌మూల మార్పులు తీసుకొస్తాన‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌దేప‌దే చెప్పారు. అంతా నిజ‌మే అనుకున్నారు. అధికారంలోకి వ‌చ్చిన కొంత కాలానికే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకొచ్చింది. దీంతో జ‌గ‌న్ మాట‌ల‌పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పెరిగింది. అయితే రానురాను పాల‌న గాడి త‌ప్పుతోంది. ఈ వాస్త‌వం అర్థం కావ‌డానికి జ‌నానికి రెండేళ్లు ప‌ట్టింది. ముఖ్యంగా రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో అధ్వాన‌మైన పాల‌న సాగుతోంది.

జ‌గ‌న్ కంటే చంద్ర‌బాబు పాల‌నే మేలు అని సొంత పార్టీ నేత‌లే అనుకునేలా ఉంది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అడంగ‌ల్ క‌రెక్ష‌న్ తొల‌గించారు. కొత్త విధానంలో ప‌నులు కావ‌డం లేదు. ఎవ‌రైనా భూమికి సంబంధించి లోపాల‌ను స‌రిదిద్దుకోడానికి స‌చివాల‌యాల్లో, మీ సేవ‌లో ద‌ర‌ఖాస్తు చేసుకుంటే… దానికి ప‌రిష్కారం ఆ దేవుడికి త‌ప్ప మ‌రొక‌రికి తెలియ‌ని దుస్థితి. చిన్న చిన్న ప‌నుల‌కు కూడా ఏడాది సమ‌యం ప‌డుతున్న‌దంటే స‌మ‌స్య తీవ్ర‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

ఎవ‌రైనా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలంటే ఈసీ, ఆర్‌హెచ్‌లాంటి ప‌త్రాలు తీసుకోడానికి క‌నీసం అంటే రెండు వారాల స‌మ‌యం ప‌డుతోంది. ఇదేమ‌ని ప్ర‌శ్నిస్తే స‌ర్వ‌ర్ స్లోగా ఉంద‌నే స‌మాధానం వ‌స్తోంది. దీంతో చిన్న ప‌నికి కూడా వారాలు, నెల‌ల త‌ర‌బ‌డి కార్యాలయాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి వ‌స్తోంది.

ఇక కొత్త పాసు పుస్త‌కాల కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌డం వ‌ర‌కే రైతులు లేదా య‌జ‌మానుల ప‌ని. ఆ త‌ర్వాత స‌ద‌రు భూమికి సంబంధించి పాసు పుస్త‌కాలు వ‌చ్చేందుకు క‌నీసం అంటే ఆరు నుంచి ఏడాది స‌మ‌యం ప‌డుతోంది. ఇది న‌మ్మ‌శ‌క్యంగా లేనప్పటికీ, వాస్త‌వం ఇదే. కొంద‌రికైతే సంవ‌త్స‌ర‌మైనా పాసు పుస్త‌కాలు రావ‌డం లేదు. 

ఇదేమ‌ని రెవెన్యూ అధికారుల‌ను ప్ర‌శ్నిస్తే …చెన్నైలో పాసు పుస్త‌కాలు త‌యారు చేస్తార‌ని, అక్క‌డ ఏం జ‌రుగుతున్న‌దో త‌మ‌కేమీ తెలియ‌దంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో త‌మ‌కు పాసు పుస్త‌కాలు వ‌స్తాయో, రావో తెలియ‌ని అయోమ‌య స్థితిలో రైతులున్నారు.

ఈ ప‌రిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంద‌ని స‌మాచారం. దీనిపై రెవెన్యూ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. రెవెన్యూ శాఖ‌లో బాధ్య‌తారాహిత్యానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలి? అధికారుల నిర్ల‌క్ష్యం చివ‌రికి జ‌గ‌న్ పాల‌న‌పై నెగెటివిటీని క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వ పెద్ద‌లు మేల్కొని పాల‌నాప‌ర‌మైన లోపాల‌ను స‌రిదిద్దుకోవాల్సి ఉంది.