తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో దసరా పర్వదినాన అవతరించనున్న భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో జనసేనాని పవన్‌కల్యాణ్ పొత్తు పెట్టుకుంటారా? అంటే… కొట్టి పారేయలేం అనే సమాధానం వస్తోంది. ఎందుకంటే తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పవన్‌కల్యాణ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.
వారంటే పవన్‌కు ప్రత్యేక గౌరవం. పవన్‌కల్యాణ్ రాజకీయం కంటే వ్యక్తిగత సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రారంభించనున్న బీఆర్ఎస్ నుంచి జనసేనకు స్నేహ హస్తం అందించే అవకాశం ఉందనే చర్చకు తెరలేచింది.
పవన్ కల్యాణ్‌పై తెలంగాణ బీజేపీ నేతలు గతంలో అవాకులు చెవాకులు పేలారు. ఏపీలో బీజేపీతో పవన్‌కు పొత్తు అనే మాటే తప్ప, ఆచరణలో ఎక్కడా కలిసి పని చేస్తున్న దాఖలాలు లేవు. పైగా ఇంత వరకూ ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా తనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదనే ఆవేదన పవన్‌కల్యాణ్‌లో బలంగా ఉంది.
ఏపీ బీజేపీ నేతలతో పవన్‌కు సన్నిహిత సంబంధాలు లేకపోవడం, అలాగే తమకు ఆప్తుడైన నేపథ్యంలో జనసేనానితో ఏపీలో కేసీఆర్ పొత్తు పెట్టుకోవచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి పవన్ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ అంటే పోరుగడ్డ అని, ఏపీలో మాదిరిగా అక్కడ కుల రాజకీయాలు లేవని పవన్ పదేపదే ప్రశంసిస్తూ వుంటారు.
తెలంగాణ సాధన కోసం ఏర్పడిన టీఆర్ఎస్, కాలక్రమంలో దేశ అవసరాల నిమిత్తం భారతీయ రాష్ట్ర సమితిగా ఏర్పడుతోందని, కలిసి పని చేయాలని కేసీఆర్ వైపు నుంచి ఏపీలోని వివిధ పార్టీల ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం అందినట్టు తెలిసింది. ఆహ్వానం అందుకున్న వారిలో పవన్‌కల్యాణ్ కూడా ఉన్నారనే చర్చకు తెరలేచింది.
బీఆర్ఎస్‌తో పొత్తు, పర్యవసానాలపై పవన్‌కల్యాణ్ సీరియస్‌గా ఆలోచిస్తున్నారని తెలిసింది. బీఆర్ఎస్‌తో పొత్తు ఉన్నా లేకపోయినా, తన మార్క్ మద్దతు మాత్రం పవన్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.