కాంగ్రెస్ ఎన్నిక‌లు.. కొత్త‌ద‌న‌మా? పాత క‌థేనా!

దాదాపు 22 యేళ్ల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ద‌శాబ్దాలుగా సోనియాగాంధీ కాంగ్రెస్ జాతీయాధ్యాక్షురాలిగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. ఏక‌గ్రీవంగా ఆమె ఎన్నిక‌వ్వ‌డం, ఆ త‌ర్వాత ఆమె త‌న‌యుడు ఒక‌సారి ఏక‌గ్రీవంగానే ఎన్నికై..…

దాదాపు 22 యేళ్ల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ద‌శాబ్దాలుగా సోనియాగాంధీ కాంగ్రెస్ జాతీయాధ్యాక్షురాలిగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. ఏక‌గ్రీవంగా ఆమె ఎన్నిక‌వ్వ‌డం, ఆ త‌ర్వాత ఆమె త‌న‌యుడు ఒక‌సారి ఏక‌గ్రీవంగానే ఎన్నికై.. క‌నీసం పూర్తి ప‌దవీకాలాన్ని పూర్తి చేయ‌కుండానే త‌ప్పుకోవ‌డం తెలిసిన సంగ‌తే. 

ఎప్పుడో సీతారాం కేస‌రి కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్య‌క్షుడిగా ఎన్నికైన‌ట్టుగా ఉన్నారు. ఆ త‌ర్వాత సోనియా గాంధీ ఆ పార్టీ బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఆమె పోటీ లేకుండా ఎన్నిక‌వుతూ వ‌చ్చారు. ఒక‌ప్పుడు మ‌హామ‌హులు త‌ల‌ప‌డిన కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ ప్రెసిడెంట్ పోస్టును అలా సునాయాసంగా సోనియాగాంధీ చేప‌డుతూ వ‌చ్చారు. ఇప్పుడు కూడా ఆప‌ద్ధ‌ర్మం హోదాలో ఆమె ఆ ప‌ద‌విలో ఉన్నారు. అయితే.. ఎందుకో ఎన్నిక‌లు చేప‌ట్టారు. అనేక మ‌లుపుల అనంత‌రం.. ప్ర‌ధానంగా ఇద్ద‌రు నేత‌లు ఆ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక బ‌రిలో ఉన్నారు. వారిలో ఒక‌రు సీనియ‌ర్ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, మ‌రొక‌రు శ‌శిథ‌రూర్.

ఇద్ద‌రూ ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన కాంగ్రెస్ నేత‌లే. వీరిలో ఖ‌ర్గే సోనియాకు బాగా విశ్వాస‌ప‌రుల్లో ఒక‌రు అనే పేరుంది. థ‌రూర్ కూడా అధిష్టానికి దాసుడే కానీ, కొంత స్వ‌తంత్ర తత్వం ఉంది. యూఎన్ లో ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. వ‌ర‌స‌గా త్రివేండ్రం ఎంపీగా నెగ్గుతూ వ‌స్తున్నారు. వ్య‌క్తిగ‌తంగా మేధావి. యువ‌త ఆమోదం ఎంతో కొంద మెరుగ్గా క‌లిగి ఉన్నారు థ‌రూర్. 

ఇక ఖ‌ర్గేది కూడా చాలా రాజ‌కీయ నేప‌థ్య‌మే కానీ.. సోనియాకు విధేయుడిగా వ్య‌వ‌హ‌రిస్తారు. అందుకే ఆయ‌న‌కు ఇది వ‌ర‌కూ లోక్ స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష నేత‌గా అవ‌కాశం ఇచ్చారు సోనియా. గ‌త ఎన్నిక‌ల్లో ఈయ‌న ఎంపీగా ఓడిపోయారు. ఇప్పుడు మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్య‌క్ష ఎన్నిక‌లో పోటీతో తెర‌పైకి వ‌చ్చారు.

మ‌రి ఇప్పుడు ఖ‌ర్గే, థ‌రూర్ ల‌లో ఎవ‌రు గెలుస్తార‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. అయితే ఎవ‌రు ఓటేస్తారో పెద్ద‌గా తెలియ‌ని ఎన్నిక‌లు ఇవి. ఓట‌ర్ల జాబితాను ఇంకా అభ్య‌ర్థులో ప‌రిశీలించారో లేదో మ‌రి! అయితే ఈ ఎన్నిక‌లంతా ఉత్తుత్తివి అని, సోనియాగాంధీకి ఎవ‌రు న‌చ్చితే వారే ఎన్నిక‌ల్లో నెగ్గుతార‌నే అభిప్రాయాలు లేక‌పోలేదు. ఎవ‌రు గెలిచినా, ఓడినా అది కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారంగానే మిగ‌ల‌వచ్చు. ఓడిపోయిన వాళ్లు కూడా సోనియాకు విధేయ‌త ప్ర‌క‌టించి.. కామ్ అయిపోనూ వ‌చ్చు! అయితే.. కాంగ్రెస్ పార్టీ దేశంలో గ‌ట్టి ప్రతిప‌క్షంగా నిల‌వాలంటే.. పాత ఖ‌ర్గే బ‌దులు శ‌శిథ‌రూర్ నెగ్గ‌డ‌మే స‌రైనది కావ‌చ్చు!

శ‌శిథ‌రూర్ వ్య‌క్తిగ‌త జీవితంలో వివాదాలున్నాయి కానీ, త‌న మేధ‌స్సుతో క‌నీసం మేధావి వ‌ర్గాన్ని అయినా థ‌రూర్ ఆక‌ట్టుకోగ‌ల‌రు. విశ్లేష‌ణాత్మ‌కంగా మాట్లాడ‌గ‌ల‌రు. సంప్రాదాయాల‌పై అకార‌ణ‌మైన అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేయ‌రు. వీలైనంత‌గా.. అన్ని వ‌ర్గాల‌నూ ఆక‌ట్టుకునేలా థ‌రూర్ మాటలుంటాయి. వృద్ధుడైన ఖ‌ర్గే క‌న్నా థ‌రూరే స‌గ‌టుయువ‌తకు న‌చ్చే నాయ‌కుడు. 

ఖ‌ర్గే క‌న్నా థ‌రూరే వీలైనంత ఎక్కువ స్థాయిలో కాంగ్రెస్ వైపు యువ‌త‌ను ఆక‌ర్షించ‌గ‌ల‌ర‌నేది చెప్ప‌గ‌లిగిన అంశం. ఇక ఖ‌ర్గే విష‌యానికి వ‌స్తే.. ద‌ళిత నేత‌. అలాగ‌ని త‌ను ద‌ళితుడిని అని చెప్పుకుని సానుభూతి ఓట్లు పొందాల‌నే తాప‌త్ర‌యం ఉండ‌దు. త‌న‌ను ద‌ళిత నేత అని అనొద్ద‌ని కోరిన నేప‌థ్యం ఉంది ఆయ‌న‌కు ఉంది. మ‌రి సోనియాకు విధేయ‌తే కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్య‌క్షుడిని చేస్తుందా, లేక థ‌రూర్ రూపంలో కొత్త కెర‌టం వ‌స్తుందో!