మెరుగైన సేవలు అందుతాయని ఏడుస్తున్నారా?

పర్యాటక రంగ సంస్థ ఆధ్వర్యంలోని హోటళ్లు, కాటేజీలు, ఫుడ్ కోర్టులను ప్రెవేటు సంస్థల నిర్వహణకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈ నిర్ణయంపై పచ్చమీడియా యాగీ చేస్తోంది. పర్యాటక రంగ సంస్థ ఆస్తులు అన్నింటినీ…

పర్యాటక రంగ సంస్థ ఆధ్వర్యంలోని హోటళ్లు, కాటేజీలు, ఫుడ్ కోర్టులను ప్రెవేటు సంస్థల నిర్వహణకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈ నిర్ణయంపై పచ్చమీడియా యాగీ చేస్తోంది. పర్యాటక రంగ సంస్థ ఆస్తులు అన్నింటినీ ప్రెవేటు వారికి ధారాదత్తం చేసేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఈ పచ్చమీడియా ఏడుపుల్లో అర్థముందా లేదా అనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. టూరిజం హోటళ్లు, కాటేజీల్లో నిర్వహణ మెరుగుపడితే చూసి ఓర్వలేని స్థితిలో విపక్షాలు, పచ్చమీడియా ఉన్నాయా? అనే అభిప్రాయం కూడా కలుగుతోంది.

ఎందుకంటే.. టూరిజం హోటళ్లు, కాటేజీలు చాలా అధ్వానమైన నిర్వహణలో సుదీర్ఘకాలంగా నడుస్తున్నాయి. నిజం చెప్పాలంటే ప్రభుత్వం వీటిని సంస్కరించలేకపోతోంది. అన్నీ విలువైన ఆస్తులు. అయితే కాంట్రాక్టు ఉద్యోగుల మీద ఆధారపడడం, వారు నిర్లక్ష్యంగా విధుల్లో ఉండడం, బిజినెస్ ప్రమోషన్ గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా.. మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తుండడం వంటివి సంస్థను దెబ్బ తీస్తున్నాయి. ఈ రంగంలో సమూలంగా మార్పులు తేవడానికి ఇన్నాళ్లకు నిర్వహణ ప్రెవేటు సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయిదేళ్ల నుంచి 22 ఏళ్ల వరకు లీజుకు ఇవ్వాలని ప్రతిపాదనలు తయారుచేశారు. బాధ్యత గల మీడియా ఈ దశలో చేయాల్సిన పని ఏమిటి? 

ప్రస్తుతం వీటి ద్వారా ఎంత బిజినెస్ జరుగుతోంది.. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తోంది.. వార్షిక ఆదాయం సగటు ఎంత లెక్క తేల్చాలి. ఆ వివరాలు ప్రాథమికంగా ఆర్టీఐ ద్వారా అడిగినా కూడా వస్తాయి. ఆ లెక్కలతో పోల్చి.. అంతకంటె ఎక్కువగా ప్రభుత్వం నష్టపోకుండా ఉండేలా ధరలు నిర్ణయించి ప్రెవేటు సంస్థలకు అప్పగించాలని సూచించాలి. ప్రెవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా మరింత ఎక్కువ లాభం ప్రభుత్వానికి కలిగేలా చూడాలని మార్గదర్శనం చేస్తే బాగుంటుంది. 

ప్రెవేటు వాళ్లు తీసుకున్న తర్వాత.. ప్రజలకు, పర్యాటకులకు అందించే సేవలు మెరుగుపడతాయనేది తథ్యమే గనుక.. వాటితో పోల్చి.. టూరిజం వారి ఆధ్వర్యంలోని ఇతర చోట్ల కూడా సేవలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుంది. ఆ సంగతిని కూడా వారు గుర్తించాలి. అదేమీ లేకుండా.. జగన్ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే.. దాని మీద బురద చల్లడం ఒక్కటే లక్ష్యంగా తాము బతుకుతున్నట్టుగా.. ప్రెవేటు వారి చేతుల్లోకి టూరిజం ఆస్తులు అంటూ ఆస్తులు రాసిచ్చేస్తున్నట్టుగా విషపూరిత కథనాలు ఇవ్వడం కరెక్టు కాదు. 

ఇంటిని అద్దెకిస్తే ఆస్తి వాళ్ల చేతుల్లో పెట్టేసినట్టు అవుతుందా? లీజుకు ఇవ్వడం కూడా అలాంటిదిదే కదా. అంత విజ్ఞత లేకుండా బురద చల్లడానికి, ప్రజల తమ చిత్తశుద్ధిని అనుమానిస్తారనే భయం కూడా లేకుండా పచ్చమీడియా బరితెగిస్తోంది.