తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చాలని నిర్ణయించుకున్నారు. దాని పేరు భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్). నూతన జాతీయ పార్టీని దసరా రోజు ప్రకటించనున్నారు. కొత్త జాతీయ పార్టీపై అప్పుడే ప్రత్యర్థులు వ్యంగ్యాస్త్రాలు విసరడం మొదలు పెట్టారు.
ఈ విషయంలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల కాస్త దూకుడు ప్రదర్శించారు. బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అంటూ ఆమె వ్యంగ్యాస్త్రం సంధించారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు బలవన్మరణాలు చెందుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏ మాత్రం పట్టింపులేదని ఆమె విమర్శించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా బీఆర్ఎస్‌పై తన మార్క్‌లతో విరుచుకుపడ్డారు. బీహార్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అభివర్ణించారు. బీఆర్ఎస్ అనేది బీజేపీకి ప్రత్యామ్నాయం కాదని, అది ఆ పార్టీకి బీ టీఎంగా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్ ఆశించినట్టుగా బీఆర్ఎస్‌పై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
తన ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై దృష్టి మళ్లించడానికే కేసీఆర్ జాతీయ పార్టీ ఎత్తుగడ వేశారనే విమర్శలకు బలం కలుగుతోంది. తెలంగాణలో కేసీఆర్ పాలనపై కాకుండా నూతన జాతీయ పార్టీ ఆవిర్భావం, దాని పర్యవసానాలు తదితర అంశాల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. దీంతో ప్రజాసమస్యల గురించి చర్చించే వాళ్లే కరువయ్యారు.