చిత్రం: రంగ్ దే
రేటింగ్:2.75/5
నటీనటులు: నితిన్, కీర్తి సురేష్, నరేష్, కౌశల్య, రోహిణి, సుహాస్, అభినవ్ గోమఠం, వినీత్
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటింగ్: నవీన్ నూలి
కెమెరా: పి.సి.శ్రీరాం
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
దర్శకత్వం: వెంకి అట్లూరి
విడుదల తేదీ: 26 మార్చ్ 2021
కరోనా పరిణామాల్లో థియేటర్లు తెరిచిన తర్వాత అతి తక్కువ వ్యవధిలో తన రెండో సినిమాతో పలకరించాడు హీరో నితిన్. 'చెక్' తో ప్రయోగం ద్వారా భంగపడిన ఈ హీరో తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ కామెడీతో ఇప్పుడు పలకరించాడు. నితిన్ కు తోడు కీర్తి సురేష్ ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్ తోనే దాదాపు రెండు దశాబ్దాల కిందటి ఆనందం, నువ్వేకావాలి వంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ లను గుర్తు చేసిన ఈ సినిమా ఆ స్థాయి ఎంటర్ టైనర్ గా నిలుస్తుందా, వాటికి నకలుగా నిలుస్తుందా అనే సందేహాలు వచ్చాయి. రంగ్ దే లోని రంగులు ఎలాంటి అనుభూతులను మిగిల్చాయో చూస్తే..
అర్జున్ (నితిన్) చిన్నప్పటి నుంచీ బిలో యావరేజ్ స్టూడెంట్. ప్రతి విషయంలోనూ పక్కింటి అను (కీర్తి) ని చూసి నేర్చుకోమని వాళ్ల నాన్న (నరేష్) చివాట్లు పెడుతూనే ఉంటాడు. అర్జున్ కి అను అంటే పడదు. కానీ అనుకి అర్జున్ మీద ఇష్టం పెరుగుతుంది. అర్జున్ కి నచ్చకపోయినా అనుతో బలవంతపు పెళ్లి చేస్తారు పెద్దవాళ్లు. ఆ తర్వాత ఏ పరిణామాలవల్ల అర్జున్ మనసు కరిగి అను మీదకి మళ్లుతుందనేది తర్వాతి కథ.
ఈ లైన్ వింటుంటే ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చిన ఆనందం, నువ్వే కావాలి వంటి సినిమాలు గుర్తుకు వస్తే తప్పు ప్రేక్షకుడిది కాదు కదా! ఆ ఫ్లేవర్ అలా తగులుతుంది. కానీ ఎంతో ఎంటర్ టైన్ మెంట్ తో అదే సమయంలో మంచి ఎమోషన్స్ తో సాగే ఆ క్లాసిక్ లవ్ స్టోరీలకూ.. ఈ సినిమాకూ సంబంధం లేదు. మరో రకంగా చూస్తే.. ఆ సినిమాలంతటి ఎమోషనల్ గా చెప్పదగిన స్టోరీని లైటర్ వేన్ లో చెప్పాలనుకుని, మరీ లైట్ చేసేయడం వల్ల లైట్ తీసుకునేలా తయారైంది.
అంతా ఫార్ములాలో నడపాలనే లెక్కలు తప్ప కథ చెప్పడంలో సిన్సియారిటీ కనపడదు. జాతీయ ఆవార్డు అందుకున్న ఎడిటర్, జాతీయ స్థాయి గుర్తింపున్న కెమెరామన్, నెంబర్ వన్ స్థానంలో ఉన్న మ్యూజిక్ డైరక్టర్..ఇలా ఎంతమంది గొప్ప టెక్నీషియన్స్ ఉన్నా కథనంలో ఆత్మ లోపిస్తే వాళ్ల ప్రతిభ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లలేదు.
ఫస్టాఫ్ లో సత్యం రాజేష్ తో బలవంతపు ఫైట్, పేలవమైన ప్రెడిక్టిబుల్ ఇంటర్వల్ సీన్, శోభనం గది బయట నుంచి తననే లీడ్ తీసుకోమని కోడలికి చెప్పే మామగారు, సుదీర్ఘమైన ప్రెగ్నెన్సీ టైం డ్రామా..ఇలా రకరకాల సీన్స్, ఎపిసోడ్స్ పెదవి విరిచేలా కొన్ని, నొసట్లు చిట్లించుకునేలా ఇంకొన్ని ఉన్నాయి.
పైగా జీమాట్ లో టాప్ స్కోర్ తెచ్చుకుని దుబాయ్ వెళ్ళి ఎం.బి.ఏ చదవడమేంటో అర్థం కాదు. లాక్ డౌన్ కారణంగా అమెరికా వెళ్లలేక దుబాయిలో షూటింగ్ లాగించేసాం అని చెప్పుకోవడానికి ఇది తెలివైన మార్గం అనిపించుకోదు. దానికన్నా దుబాయిలోనే తీసి, అమెరికా అని బ్లఫ్ చేసుండాల్సింది. అదేమంత కష్టం కాదు కూడా.
ఎంతో ప్రతిభగల దర్శకుడు ఈసారి కథా కథనాలపై దృష్టి పెట్టలేదని తెలుస్తూనే ఉంటుంది. చిన్న ఎమోషన్ కే పెద్దగా రియాక్ట్ అయ్యే ఆడియన్స్ ని మాత్రమే కాకుండా, రాయిలాంటి ప్రేక్షకుల్ని కూడా కదిలిస్తే అది బెస్ట్ రైటింగ్ అనిపించుకుంటుంది. ఇది ఆ స్థాయి రచనైతే కాదు.
నితిన్-కీర్తి జంట చూడచక్కగా ఉన్నారు. నటన కూడా స్కోప్ ఉన్నంతలో బాగానే చేసారు. వెన్నెల కిషోర్ బాగానే నవ్వించాడు. బ్రహ్మాజిని ఇంకాస్త వాడుండాల్సింది. సుహాస్, అభినవ్ గోమఠం హీరో ఫ్రెండ్స్ గా ఓకే. ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్ గా కాసేపు, పుత్రోత్సాహంతో కాసేపు నరేష్ మెప్పించాడు.
టెక్నికల్ గా చూస్తే పాటలు కొన్ని బాగున్నాయి. అయినా దేవీశ్రీప్రసాద్ స్థాయికి ఇది తక్కువే. ఎడిటింగ్, కెమెరా వగైరాలు ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. ఫన్ ఓరియెంటేషన్ తో తీయాలనుకున్నప్పుడు “ఎఫ్-2” లాగా తీసేసున్నా సరిపోయేది. గుండెకు హత్తుకునే ఎమోషన్ తో నడపాలనుకున్నప్పుడు ఈ దిశలో ఇంకాస్త శ్రద్ధ పెట్టుండాల్సింది. రెండూ కావాలనుకోవడంలో రెండిట్లో ఏదీ పూర్తిగా అందలేదనిపిస్తుంది. విషయం ఎలా ఉన్నా స్టార్ పవర్ తోటి, ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్న ట్రైలరుతోటీ ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించుకోవచ్చు.
బాటం లైన్: మరీ అన్ని రంగుల్లేవ్