తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డిపై చంద్రబాబు ఫైర్ అయ్యారని సమాచారం. మూడు రోజుల క్రితం శ్రీకాళహస్తి పట్టణంలో ఓ మహిళపై సీఐ అంజూ యాదవ్ దురుసుగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే సందర్భంలో సీఐపై మహిళా కమిషన్ మెంబర్ జీవీ లక్ష్మి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళను సీఐ వివస్త్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సీఐ డిపార్ట్‌మెంట్‌కే కలంకం అని ఆమె మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో జగన్ పాలనలో మహిళకు రక్షణ లేదనేందుకు నిలువెత్తు ఘటన కళ్ల ముందున్నా రాజకీయంగా సొమ్ము చేసుకోవడంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డి విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ ఘటనను అడ్డు పెట్టుకుని రాజకీయంగా వైసీపీని బద్నాం చేసేందుకు అన్ని అవకాశాలున్నా, ఎందుకు వాడుకోలేదని నిలదీసినట్టు తెలిసింది.
ముఖ్యంగా మహిళా కమిషన్ మెంబర్ ఆవేశంగా మాట్లాడిన వీడియోను వాడుకుని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఎందుకు ఏకిపారేయలేదని బొజ్జలను చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలిసింది. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదనే విషయాన్ని స్వయంగా ఆ పార్టీ నియమించిన మహిళా కమిషన్ మెంబరే సోషల్ మీడియా వేదికగా ఆక్రోశం వెళ్లగక్కగా, నిలదీయడానికి మీకెందుకు ఇబ్బంది అని చీవాట్లు పెట్టినట్టు తెలిసింది.
అసెంబ్లీలోనూ, బయట తనను బియ్యపు మధుసూదన్‌రెడ్డి వెటకారం చేయడం చూడలేదా? అని బొజ్జలను బాబు ప్రశ్నించినట్టు తెలిసింది. మరోసారి ఇలాంటివి పునరావృతం కావద్దని, ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలి పెట్టొద్దని బొజ్జలకు పార్టీ అధినేత సూచించారని సమాచారం.