నిండా మునిగిన వాడికి చలేమిటి? అన్నట్లుగా.. తెలంగాణలో నిండా సమాధి అయిపోయిన తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు కేసీఆర్ వలన ఇప్పుడు కొత్తగా పుట్టే టెన్షన్ ఏముంటుంది? అని అనుకుంటున్నారా? మరి అక్కడే ఉంది మతలబు! చంద్రబాబులో ప్రస్తుతం పుడుతున్న భయం మొత్తం.. కేసీఆర్ దసరా పర్వదినం నాడు ప్రకటించబోతున్న జాతీయ పార్టీ గురించి. ఆ పార్టీ ఆంద్రప్రదేశ్ లో నిర్వహించబోయే కార్యకలాపాలు ఎలా ఉంటాయి? ఆ మేరకు తనకెంత నష్టం వాటిల్లుతుంది అనే దిశగా ఆయన భయపడుతున్నారు.
కేసీఆర్ తన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడానికి ఫిక్సయిపోయారు. అధికారిక ప్రకటన రెండు రోజుల్లో వస్తుంది. ఇతర పార్టీలతో మైత్రీ సంబంధాలు పెట్టుకుని.. పొత్తుల్లో వివిధ రాష్ట్రాల్లో కొన్ని సీట్లు పుచ్చుకున బీఆర్ఎస్ అభ్యర్థులను పోటీచేయిస్తారా? లేదా వీలైన ప్రతిచోటా సొంతంగా మాత్రమే బరిలోకి దిగుతారా? అనేది మీమాంస.
ఇతర పార్టీలతో సంబంధం లేకుండా పొత్తులు పెట్టుకోవడానికి ఎంఐఎం సిద్ధంగానేఉండవచ్చు. అదే సమయంలో.. ఆయన జాతీయ పార్టీ ప్రకటన వచ్చిన వెంటనే.. వామపక్షాలు కూడా దానిని స్వాగతిస్తున్నాయి. కేసీఆర్.. వివిధ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి తగినట్టు ఆ రాష్ట్రంలో అన్నట్లు కొన్ని పొత్తులు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది.
అయితే.. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ఏపీలో కూడా బీఆర్ఎస్ ను వీలైనన్ని చోట్ల పోటీకి దింపడం కేసీఆర్ కు తప్పదు. ఎందుకంటే.. తన పొరుగు రాష్ట్రంలో ఏపీలో కూడా పోటీలో లేకపోతే.. ఆయన ఇతర రాష్ట్రాల్లో మర్యాద నిలబెట్టుకోలేరు. ఏపీలో రాజకీయాల కోణంలోంచి చూసినప్పుడు.. జగన్ అసలు ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకునే రకం కాదు గనుక.. కేసీఆర్.. బీఆర్ఎస్ విడిగా బరిలోకి రావాల్సిందే. విపక్ష చంద్రబాబునాయుడుతో కేసీఆర్ పొత్తు అనేది అనూహ్యం. వారిద్దరి శత్రుత్వం అందరికీ తెలుసు. పైగా చంద్రబాబునాయుడు బిజెపి మోచేతి నీళ్లు తాగడానికి ఉవ్విళ్లూరుతున్నారనే సంగతి కూడా అందరికీ తెలుసు.
బిజెపితో పొత్తుల్లో ఉన్న జనసేనను కూడా దగ్గరకు రానివ్వరు కేసీఆర్. బిజెపిని వదిలిపెట్టినా కూడా పవన్ కల్యాణ్ ను కేసీఆర్ దగ్గరకు రానివ్వరు. ఆ సమీకరణాలు వేరు. అలాంటి నేపథ్యంలొ ఏపీలో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీచేయాల్సి వస్తుంది. బిజెపి అనుకూల వైఖరి ఉన్నంతకాలమూ కమ్యూనిస్టులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను దూరం పెడతారు. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు కనీసమైన ఓట్లు ఉంటాయి. ఆ పార్టీలతో కలిసి కేసీఆర్ ఏపీ మొత్తం పోటీచేసే అవకాశం ఉంది. అదే జరిగితే చంద్రబాబు మరియు పవన్ కల్యాణ్ కూటమి పుట్టి మునుగుతుంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అలాంటిది ఉంటే గనుక.. దారుణంగా చీలిపోతుంది. కేసీఆర్ అభ్యర్థులు డబ్బు పరంగా కూడా బలంగానే తలపడగలరు. గెలుస్తారో లేదో తర్వాత.. యాంటీ జగన్ ఓట్లను బాగా చీలుస్తారు. జగన్ వ్యతిరేక ఓటు చీలరాదని అంటూ చంద్రబాబు పల్లకీ మోయడానికి సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ పప్పులు ఉడకవు. ఓటు చీలితే.. తెలుగుదేశానికి ఇప్పుడు వచ్చినన్ని సీట్లు రావడం కూడా కష్టమే. సమీకరణాలు మొత్తం మారిపోతాయి.
2009లో చిరంజీవి పార్టీ పుణ్యమాని.. 2019లో చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ పుణ్యమాని ఓట్లు చీలిపోగా.. అధికారం దక్కించుకోలేకపోయిన చంద్రబాబు.. 2024 కోసం చాలా జాగ్రత్తగా రెడీ అవుతూ వస్తున్నారు గానీ.. తీరా ఎన్నికలు వచ్చే సమయానికి కేసీఆర్–బీఆర్ఎస్ రూపంలో ఆయన నెత్తిమీద గుదిబండ పడబోతోంది. ప్రస్తుతం కేసీఆర్ ప్రకటన గురించి చంద్రబాబులో అదే టెన్షన్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.