మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయంగా పైచేయి సాధించడానికి ఎన్నెన్నో వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి జగదీష్‌రెడ్డి బీజేపీకి అంత సీన్ లేదని చెప్పేందుకు కాంగ్రెస్‌కు లేని బలాన్ని తెచ్చి పెడుతున్నారు. అబ్బే… మునుగోడులో కాంగ్రెస్‌తోనే తమ పోటీ అని ఆయన చెప్పడం గమనార్హం.
మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో మంత్రి జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయా ల్లోకి కేసీఆర్ వస్తున్నారనే భయంతోనే మునుగోడుకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. పార్టీ నేతలతో ఆదివారం కేసీఆర్ సమావేశాన్ని చూసి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు రాత్రి నిద్రలేక మునుగోడు నోటిఫికేషన్ ఇప్పించారని విరుచుకుపడ్డారు.
రైతుల మోటర్లకు మీటర్లు, నిత్యావసర సరుకుల ధరలు పెంచి జేబులకు చిల్లులు పెడుతున్న బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇదిలా వుండగా మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుందని అనుకున్నామన్నారు. ఓటమి భయంతో ఆలస్యంగా ఇచ్చారన్నారు. మునుగోడులో కాంగ్రెస్‌తోనే తమకు పోటీ అని ఆయన తేల్చి చెప్పారు. మునుగోడులో గెలిచి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల మనసుల్లోంచి కేసీఆర్‌ను లేకుండా చేయడం ఎవరి వల్లా కాదన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా జాతీయ రాజకీయాల్లోకి రాకుండా కేసీఆర్‌ను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కొత్త అభివృద్ధి నమూనాతో జాతీయ రాజకీయాల్లోకి వస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.