కొత్త పార్టీ అంటే జనాలకు ఆప్షన్ అన్నది ఎంతవరకూ ఉంటుందో ప్రజాస్వామ్యానికి పండుగ ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ రాజకీయ జీవులకు మాత్రం అతి పెద్ద పండుగ. ఇప్పటికే ఇరుక్కుని మరీ ఉన్న పార్టీలతో సర్దుకోలేని వారు, అన్ని పార్టీలు చక్కబెట్టేసి మళ్ళీ భూమి గుండ్రంగా ఉంది అని మొదటి పార్టీలోకే వెళ్ళలేక వెళ్ళాలనుకునేవారు చాలా మంది రాజకీయ నేతలు ఉంటారు.
ఉన్న పార్టీలో టికెట్లు దక్కవనుకున్న వారు, జీవితంలో ఒకసారి పోటీ చేయాలని ఆలోచించేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితా ఎపుడూ ఉంటుంది. అలాంటి వారికి రాజకీయ పండుగ చేసుకోమని తెలంగాణా అధినాయకుడు కేసీయార్ అంటున్నారు. జాతీయ పార్టీని ఆయన దసరా నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. మరి నాయకులు కావాలి కదా.
అందుకే ముందు ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటే వారికే చాన్స్. కేసీయార్ ఏపీ రాజకీయాలను పలు రకాల సమీకరణలతో చూస్తున్నారు. కులం ఫ్యాక్టర్ తో పాటు ప్రాంతీయ కార్డు, అలాగే తన మాజీ పార్టీ టీడీపీ పరిచయాలతో పాత వాటాలను తేల్చుకునేందుకు జాతీయ పార్టీ ద్వారా చూస్తున్నారు అని తెలుస్తోంది.
ముఖ్యంగా చూస్తే కేసీయార్ పూర్వీకులు ఉత్తరాంధ్రాకు చెందిన వారు అన్నది చెప్పుకునే మాట. వారిది బొబ్బిలి. ఇపుడు ఆ బొబ్బిలి కేసీయార్ జాతీయ పార్టీకి ఒక దారి చూపబోతోంది అని అంటున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలలో ఉన్న తన సొంత సామాజికవర్గం వెలమ సోదరులకు కేసీయార్ ఆఫీస్ నుంచి వరసబెట్టి ఫోన్లు వస్తున్నాయని ప్రచారంలో ఉన్న మాట.
టీడీపీ తమ్ముళ్ళను ఆయన తన పార్టీ వైపుగా ఆకర్షించే ప్రయత్నాలు మొదలెట్టారు అని భోగట్టా. కేసీయార్ పార్టీ ప్రకటన వేళకు హైదరాబాద్ ఎంతమంది నేతలు ఇక్కడ నుంచి వెళ్తారో అన్న ఆసక్తి అయితే గట్టిగానే ఉంది. టీడీపీ బడా నేతల మీద కూడా కేసీయార్ చూపు ఉంది అని చెబుతున్న వేళ ఆయా నేతల కదలికల మీద పసుపు పార్టీ నిఘా వేసి ఉంచింది అంటున్నారు.