Advertisement

Advertisement


Home > Movies - Movie News

మ‌ణిర‌త్నం ప‌రువు నిల‌బ‌డిన‌ట్టే!

మ‌ణిర‌త్నం ప‌రువు నిల‌బ‌డిన‌ట్టే!

భారీ సినిమాల‌కు కేరాఫ్.. సాహసోపేత‌మైన క‌థా,క‌థ‌నాలు ఆయ‌న‌కు కొత్త కాదు. అయితే గ‌త కొన్నేళ్లుగా స‌రైన హిట్ లేదు. యేళ్లు కాదు.. ద‌శాబ్దాలు అనాలేమో! మ‌ధ్య‌లో *ఓకే బంగారం*, *చిక్కాచివంత‌వానం*(తెలుగులో న‌వాబ్) వంటి సినిమాలు మాత్రం ఫ‌ర్వాలేదు అనిపించుకున్నాయి. 

ఇలాంటి క్ర‌మంలో మ‌ణిర‌త్నం ఒక‌ర‌కంగా విక్ర‌మార్క ప్ర‌య‌త్న‌మే చేసి *పొన్నియ‌న్ సెల్వ‌న్* ను రూపొందించాడు. అది కూడా ఒక పార్టులో చెప్ప‌గ‌లిగే క‌థ కాదంటూ.. రెండు పార్టులు అంటూ ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు ఫ‌స్ట్ పార్టును భ‌గీర‌థ‌ప్ర‌య‌త్నంలా రూపొందించి విడుద‌ల చేశారు.

తొలి రోజే తెలుగు వారికి ఈ కాన్సెప్ట్ ఎక్కేది కాద‌నే స్ప‌ష్ట‌త వ‌చ్చింది. వాస్త‌వానికి చ‌రిత్ర ఆధారంగా ఈ న‌వ‌ల‌నే ఐదు సంవ‌త్స‌రాల పాటు సీరియ‌ల్ గా ప్ర‌చురించార‌ట‌! అస‌లు క‌థ‌లో యాభైకి పైగా ప్ర‌ధాన పాత్ర‌లుంటాయ‌ట‌. వాటిల్లో మ‌ణిర‌త్నం సినిమా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌రికి.. అనేక పాత్ర‌ల‌ను  తొల‌గించి, ప్ర‌స్తుత తారాగ‌ణంతో సినిమాగా ఆ క‌థ‌ను తెర‌కెక్కించార‌ట‌! 

ప్రీ రిలీజ్ మార్కెట్ లో రెండు పార్టుల‌నూ ఒకేసారి అమ్మేసిన‌ట్టుగా తెలుస్తోంది. డిజిట‌ల్ రైట్స్, ఓటీటీ ల‌తో ఈ సినిమా వంద కోట్ల రూపాయ‌ల పై స్థాయి డీల్ నే పొందింద‌ని తెలుస్తోంది. అయితే మేకింగ్ ఖ‌ర్చులు, పారితోషికాల‌తో ఈ సినిమా బ‌డ్జెట్ త‌డిసిమోపెడు అయి ఉండ‌వ‌చ్చు. త‌మిళ‌నాట ఆవ‌ల ఈ సినిమాకు పెద్ద బజ్ కానీ, ఊపు కానీ లేక‌పోయినా.. త‌మిళ‌నాడు వ‌ర‌కూ అయితే భారీ వ‌సూళ్లే ద‌క్కుతున్న‌ట్టుగా ఉన్నాయి.

హిందీ వెర్ష‌న్ లో వారాంతానికి ఏడున్నర కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు ల‌భించాయ‌ట‌. మామూలుగా మ‌ణిర‌త్నం సినిమాల‌కు హిందీలో ఇంత‌క‌న్నా ఎక్కువ మార్కెట్టే ఉంటుంది. అయితే.. ప‌క్కా అర‌వ క‌థ కావ‌డంతో నార్త్ ను కూడా ఈ సినిమా అంత ఆక‌ట్టుకోవ‌డం లేదు. తెలుగు వారికే అంతు చిక్క‌ని ఈ క‌థ హిందీ బెల్ట్ లో న‌డవ‌క‌పోవ‌డం పెద్ద విచిత్రం కాదు. మ‌ల‌యాళీలు మాత్రం కొంత వ‌ర‌కూ ఆద‌రిస్తున్నార‌ని ఈ సినిమా క‌లెక్ష‌న్ల‌ను బ‌ట్టి తెలుస్తోంది. స్థూలంగా ఈ సినిమా రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల పై స్థాయి గ్రాస్ వ‌సూళ్ల‌ను సంపాదించింద‌ని ప్ర‌క‌టించుకున్నారు. 

తెలుగులో ఇప్పుడిప్పుడు స‌గ‌టు ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమాను చూడొచ్చేమో.. అన్న‌ట్టుగా స్పందిస్తున్నారు. భారీ సినిమాతో మ‌ణిర‌త్నం పాన్ ఇండియా హిట్ కొట్ట‌లేక‌పోతున్నా.. ప‌రువునైతే నిలుపుకుంటున్నాడు! అంతే కాదు.. ఒకసారి చూస్తే క‌థ‌ను అర్థం చేసుకోవ‌డం క‌ష్టం అనే రివ్యూల‌ను ఎదుర్కొంటున్న ఈ సినిమా ఓటీటీల్లో వ‌ర్క‌వుట్ కావొచ్చు కూడా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?