స్వతంత్రం వచ్చి 75 యేళ్లు గడిస్తే.. ఇన్నేళ్లలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష హోదాలో గాంధీ-నెహ్రూ కుటుంబీకులు 42 సంవత్సరాలు ఉంటే, గాంధీయేతరుడు ఈ హోదాలో 33 సంవత్సరాల పాటు ఉన్నారు. వీరిలో కూడా అత్యధిక కాలం ఈ హోదాలో సోనియాగాంధీనే వ్యవహరించారు. 1998లో సీతారాం కేసరి తర్వాత ఈ హోదాకు ఎన్నికైన సోనియా.. ఆ తర్వాత తనయుడికి పగ్గాలు అప్పగించే వరకూ ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. 22 సంవత్సరాలుగా ఏఐసీసీ ప్రెసిడెంట్ పదవికి ఎన్నికే జరగలేదు. అంతా ఏకగ్రీవమే!
మరి ఇప్పుడు పోటీలో నిలిచిన ఇద్దరు నేతల్లో ఎవరు ఎన్నికైనా.. గాంధీయేతరుడే కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు అవుతారు. కేసరి తర్వాత ఈ ఘనతను సాధించిన వారవుతారు. అయితే.. ఎటొచ్చీ మల్లిఖార్జున ఖర్గే గెలిస్తే మాత్రం మజా ఉండదని స్పష్టం అవుతోంది. ఇందుకు ప్రధాన కారణం.. అధ్యక్ష ఎన్నికలో ఖర్గేకు సోనియా, రాహుల్ ల ఆశీస్సులు ఉన్నాయనే అభిప్రాయం!
పార్టీ అధ్యక్ష హోదాలో తమ కనుసన్నల్లో మెలిగే వ్యక్తి ఉండాలని సహజంగానే సోనియా అనుకోవచ్చు. రాహుల్ కూడా ఇదే కోరుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే గెహ్లాట్, ఖర్గే వంటి వాళ్లు తెరపైకి వచ్చారని స్పష్టం అవుతోంది. వారికి ఈ వయసులో కాంగ్రెస్ ను జాతీయ స్థాయిలో నడిపే శక్తియుక్తులు రెండూ లేవని ఎవరైనా ఇట్టే చెప్పగలరు!
ఈ వయసులో ఖర్గే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిగా ఎన్నికైతే.. కాంగ్రెస్ కు వచ్చే ఉత్తేజం ఏముంటుంది? జాతిలో ఆయన కాంగ్రెస్ పై ఏ మేరకు నమ్మకాన్ని పెంచగలరో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు కూడా! వ్యక్తిగత జీవితం సంగతెలా ఉన్నా.. థరూర్ ఎన్నికైతే ఏదో కొంత కొత్తదనమైనా ఉండవచ్చు. ఖర్గే ఎన్నికైతే మాత్రం..రామేశ్వరం వెళ్లినా.. అనే సామెత గుర్తుకు రావొచ్చు!
ఎన్నికైతే కాదు.. ఖర్గే ఎన్నిక కావడమే లాంఛనమని, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితం అలాగే ఉంటుందని సూఛాయగా స్పష్టం అవుతోంది. మరి అదే జరిగితే.. ఈ అధ్యక్ష ఎన్నిక పార్టీలో ఉత్సాహాన్ని ఇవ్వడం మాట అటుంచి, సగటు ప్రజల దృష్టిలో కాంగ్రెస్ మరింత పలుచన కావడం ఖాయం!