తెలుగులో రష్మికను పాపులర్ చేసింది హిట్ సినిమాలు మాత్రమే కాదు. కిస్ సీన్లు కూడా! ప్రత్యేకించి ఆమె నటించిన రొమాంటిక్ సీన్లు తెలుగునాట ప్రేక్షకులను ఆకట్టుకుంటే, ఆమె సొంత రాష్ట్రంలో మాత్రం ఆగ్రహావేశాలను రేకెత్తించాయి. వాటిల్లో కూడా *గీతాగోవిందం* సినిమాలో రష్మిక చేసిన సీన్లను కన్నడీగులు ఆక్షేపించారు. అప్పటికే ఆమె కన్నడలో హిట్ కొట్టిన నటి, అంతకు మించి.. ఎంగేజ్డ్! అప్పటికే నిశ్చితార్థం చేసుకున్న రష్మిక తెలుగులోకి వచ్చి అలాంటి సీన్లలో నటించడం కన్నడ ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు పాపం!
ఎంతలా అంటే.. అప్పట్లో ఆ సీన్లపై కన్నడ టీవీ చానళ్లు లైవ్ డిబేట్లు పెట్టినంత పని చేశాయి. సోషల్ మీడియాలో కూడా రష్మికను ఒక పాపాత్మురాలు అన్నట్టుగా తెగ నీతులు బోధించారు నెటిజన్లు. ఆమె నటించిన సీన్లు ఆమె ప్రియుడికి నచ్చలేదని, అతడు ఎంగేజ్ మెంట్ రద్దు చేసుకోబోతున్నాడని కూడా మీడియా జోస్యం చెప్పింది. చివరకు ఎవరు రద్దు చేసుకున్నారో కానీ వారు ఎంగేజ్ మెంట్ రద్దు చేసుకున్నారు. ఒకరినొకరు నిందించుకోలేదు. ఇప్పటికీ పలకరించుకోగల చనువు ఉందట!
వారి సంగతెలా ఉన్నా.. అప్పట్లో రష్మికను మాత్రం చాలా నిందించారు. ఆమెనో స్వార్థపరురాలిగా, తెలుగు సినిమాలతో వచ్చే భారీ పారితోషికాలకు ఆశపడి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న వ్యక్తిగా చిత్రీకరించడానికి జనాలు బాగా ఉబలాటపడ్డారు. మరి ఈ ట్రోల్స్ తో రష్మికకు జరిగిన నష్టం లేదు కానీ, తీవ్రమైన బాధను అయితే అనుభవించిందట.
గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో తను చేసిన లిప్ లాక్ సీన్లపై తీవ్రమైన నెగిటివ్ ట్రోలింగ్ జరగడంతో తను తీవ్రంగా ఇబ్బంది పడినట్టుగా రష్మిక చెబుతోంది. విమర్శల ధాటికి తను రోజుల తరబడి ఒక రకమైన డిప్రెషన్లో ఉన్నట్టుగా చెప్పింది. రాత్రిళ్లు దిండులో మొహం పెట్టుకుని ఏడ్చేదాన్నంటూ రష్మిక వివరించింది.
ఆ ట్రోలింగ్ ప్రభావం తనపై అలా తీవ్రమైన నెగిటివిటీకి కారణమైందని చెప్పింది. నెమ్మదినెమ్మదిగా ఆ ప్రభావం నుంచి బయటపడినట్టుగా రష్మిక వివరించింది. కిస్ సీన్లను చొంగ కార్చుకుంటూ చూసే జనాలు నీతులు చెప్పడానికి వెనుకాడరు. ఆ కామెంట్లు సహజంగానే సినీతారలపై నెగిటివ్ ఇంపాక్ట్ ను చూపవచ్చు!