నిన్నటికి నిన్న అయోధ్యకు వచ్చిన టాప్ స్టార్ ప్రభాస్ ను చూసిన అభిమానులు అంతా చాలా బాధపడ్డారు. మెట్లు దిగడానికి ప్రభాస్ ఇబ్బంది పడుతున్న వైనం, ఇటు అటు ఇద్దరి సాయం తీసుకున్న తీరు చూసి చాలా ఆవేదన పడ్డారు. ప్రభాస్ కు మోకాలి సమస్య వుందని తెలుసు కానీ తగ్గిపోయిందని అనుకుంటున్నారంతా. ఇప్పుడు క్లారిటీ వచ్చింది..తగ్గలేదని. అసలు సంగతి ఏమిటి అని విచారిస్తే.. మరింత బాధపడే సంగతులు తెలిసాయి.
బాహుబలి పుణ్యమా అని ప్రభాస్ మోకాళ్లు రెండూ చాలా ఇబ్బంది పెడుతున్నాయట. వాటికి సర్జరీనే మార్గం అని కానీ ఈ లోగా సర్జరీని అవాయిడ్ చేయడానికి, అది అవసరం లేకుండా తగ్గడానికి తరచు ఇంజక్షన్లు తీసుకోవాల్సి వస్తోంది అని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఆ ఇంజక్షన్లు కూడా ఇటలీ వెళ్లి తీసుకోవాల్సి వస్తోందట.
ఫంక్షన్ లో ఇద్దరి సాయంతో మెట్లు దిగితేనే బాధపడ్డారు ఫ్యాన్స్. కానీ ఇంట్లో తను, తన కుటుంబ సభ్యులు మాత్రమే వుంటే రెండు చేతులకు స్టిక్స్ తగిలించుకుని కాళ్ల మీద భారం పడకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. సర్జరీ చేయించుకంటే కనీసం ఆరునెలలు రెస్ట్ తీసుకోవాలంట. అది సాధ్యం కాక ఇంజక్షన్లతో నెట్టుకు వస్తున్నాడని బోగట్టా.
అసలు ఇలా వుండడం వల్లనే మోషన్ క్యాప్చర్, యానిమేషన్ తో పని జరిగిపోతుందని ఓం రౌత్ ఆదిపురుష్ ను, అలాగే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అవుతుందని మారుతి సినిమాను ప్రభాస్ అంగీకరించినట్లు తెలుస్తోంది.
బాహుబలి సినిమా కోసం ఇటు ప్రభాస్..అటు రానా విపరీతంగా తమ తమ శరీరాలను ఇబ్బంది పెట్టుకున్నారు. ఫలితంగా రానాకు ఆరోగ్యం పాడయింది. మొత్తానికి కోలుకున్నాడు. ప్రభాస్ కోలుకోవాల్సి వుంది.
ప్రస్తుతానికి బయటకు రావడం లేదు కానీ, రోప్స్ కట్టిన సీన్లు ఎక్కువగా చేయడం వల్ల ఎన్టీఆర్. చరణ్ కూడా చాలా ఇబ్బందిపడ్డారని తెలుస్తోంది. మొత్తానికి రాజమౌళి సినిమాల పుణ్యమా అని హీరోల ఆరోగ్యాలు పాడవుతున్నాయని అనుకోవాల్సిందే.