గౌహతి వేదికగా ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్య ఆదివారం జరిగిన రెండవ టీ 20 మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. ఇండియన్ బ్యాటర్లు అందరూ అద్భుతంగా రాణించారు. సూర్యకుమార్ యాదవ్ (SKY) ఆకాశమే హద్దుగా మళ్ళీ చెలరేగాడు. కోహ్లీ,రాహుల్, రోహిత్ కూడా వేగంగా పరుగులు చేసారు. చివర్లో దినేష్ కార్తీక్ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో టీం ఇండియా 237 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది టీ 20లలో టీం ఇండియాకు నాలుగవ అత్యధిక స్కోరు.
అనంతరం బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన కిల్లర్ మిల్లర్ భారత బౌలర్లను బౌలింగ్ ని చితక్కొట్టాడు. కేవలం 47 బంతుల్లో 106 పరుగులు చేసాడు. అయితే ఎట్టకేలకు ఇండియా 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే ఈ విజయం మన బౌలింగ్ బలహీనతలను కప్పేసింది. దీపక్ చాహర్ తప్ప మిగిలిన బౌలర్లందరూ ఓవర్ కు తొమ్మిది పైగా పరుగులిచ్చారు. మిల్లర్ మరియు డీకాక్ లు నాలుగో వికెట్ కు 82 బంతుల్లోనే 174 పరుగులు చేసారు.
డెత్ ఓవర్లలోనైతే ఇంకా దారుణం. కొంత కాలంగా డెత్ ఓవర్లలో మన భువీ, బుమ్రా లాంటి ప్రధాన బౌలర్లతో సహా అందరూ ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. ఆసియా కప్ పరాజయానికి ఇదే ముఖ్య కారణం.
గత మ్యాచ్ లో ఆఖరి రెండు ఓవర్లలో ఏకంగా 45 పరుగులు సమర్పించుకున్నారు.
ఇదే ఇప్పుడు టీం ఇండియా యొక్క ప్రధాన బలహీనత. త్వరలో జరుగనున్న ప్రపంచ కప్ లో ఇది మన జట్టు యొక్క విజయావకాశాలను దెబ్బ తీసే అవకాశం ఉంది. మేనేజ్మెంట్, సెలక్టర్లు త్వరగా ప్రత్యామ్నాయాలను కనుగొనాలి. లేకపోతే బ్యాటర్లు ఎంత అద్భుతంగా రాణించి భారీ స్కోరు చేసినా, చివరి వరకూ గెలుపుకి గ్యారంటీ ఉండదు.
మురళీకృష్ణ నిష్టల