హైదరాబాద్ లో చార్మినార్ కు ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్నే నమ్ముకుంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో తన రాజకీయాన్ని పట్టాలెక్కించాలంటే ఏ పనిని మొదలుపెట్టినా అక్కడ నుంచే మొదలుకావాలన్నట్టుగా బీజేపీ పొలిటికల్ యాక్టివిటీ సాగుతూ ఉంది. ఆ మధ్య జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ తన కార్యకలాపాల్లో భాగ్యలక్ష్మి ఆలయాన్ని హైలెట్ చేసింది.
టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పదే పదే ఆ ఆలయ ప్రస్తావన తీసుకు వచ్చారు. తమ రాజకీయ కార్యక్రమాలను ప్రారంభించాలన్నా, ప్రమాణాల సవాళ్లు చేయాలన్నా.. భాగ్యలక్ష్మీ ఆలయానికే రావాలంటూ బహిరంగ ప్రకటనలు చేశారు. బీజేపీ ముఖ్య నేత అమిత్ షా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార పర్వంలోనూ భాగ్యలక్ష్మీ ఆలయమే చర్చలోకి వచ్చింది.
ఇక ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల పోరాటాన్ని కూడా చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచినే ప్రారంభిస్తారట బండి సంజయ్. త్వరలోనే అక్కడ నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అవుతుందట. అక్కడితో మొదలుపెట్టి.. హుజూరాబాద్ వరకూ ఆయన తన పాదయాత్రను కొనసాగిస్తారట!
మొత్తానికి తెలంగాణలో బీజేపీ రాజకీయం అంతా.. ఆ బుల్లి ఆలయంతో ముడి పడి ఉండటం గమనార్హం. తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఆలయాలు ఉన్నా.. మతపరంగా సెన్సిటివ్ వ్యవహారం అయినా.. భాగ్యలక్ష్మీ టెంపుల్ ను బీజేపీ ఏ మాత్రం గ్యాప్ లేకుండా ప్రస్తావిస్తూ ఉంది. మరి ఈ సారి ఉప ఎన్నిక విషయంలో.. బీజేపీ రాజకీయానికి ఆ ఆలయ కరుణ ఎలా ఉంటుందో!