తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి సొంతమైన హెరిటేజ్ సంస్థలో గతంలో తను కూడా ఒక పెట్టుబడిదారుడినే అని ప్రకటించుకున్నారు నటుడు, నిర్మాత మోహన్ బాబు. ఒక టీవీ చానల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు. హెరిటేజ్ ప్రారంభంలో దానిలో తను కూడా పెట్టుబడిదారుడినే అని, తనతో పాటు చంద్రబాబు నాయుడు కూడా అందులో డబ్బులు పెట్టారని, ఇతరులు కూడా భాగస్వామ్యులే అని ఆయన చెప్పారు.
ఆరంభంలో హెరిటేజ్ లో ఎక్కువ డబ్బు పెట్టింది, ఎక్కువ షేర్ ను కలిగి ఉన్నది కూడా తనేనని ఆయన అన్నారు. అయితే కాలక్రమంలో చంద్రబాబు నాయుడు తనను మోసం చేసి హెరిటేజ్ నుంచి బయటకు పంపించేశాడని కూడా మోహన్ బాబు చెప్పడం విశేషం. ఇదే విషయాన్ని తను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వద్ద కూడా గతంలో ప్రస్తావించినట్టుగా మోహన్ బాబు చెప్పారు.
పాదయాత్ర సమయంలోనే వైఎస్ తో ఒకసారి కలిస్తే.. ఆ సమయంలోనే ఈ విషయాన్ని తను చెప్పానన్నారు. సొంతమామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నిన్ను మోసం చేయడంలో వింత ఏమందని అప్పుడు వైఎస్ అన్నారని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇలా హెరిటేజ్ తేనెతుట్టెను మోహన్ బాబు కదపడం ఆసక్తిదాయకంగా ఉంది. ఎన్టీఆర్ పిలిస్తే తను వెళ్లి తెలుగుదేశంలో చేరానని, తనను మెచ్చి అన్నగారు రాజ్యసభ సభ్యుడిని చేస్తే.. తను ఎందుకూ పనికిరానంటూ ఆ తర్వాత చంద్రబాబు పక్కన పెట్టారన్నట్టుగా మోహన్ బాబు స్పందించారు.
తన తదుపరి సినిమా సన్నాఫ్ ఇండియాలో సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలను ప్రస్తావించనున్నట్టుగా మోహన్ బాబు చెప్పారు. తనకు గతంలో కూడా సినిమాకు రచనా సహకారం చేసిన అనుభవ ఉందని, ఇప్పుడు మళ్లీ ఈ సినిమా కోసం పెన్నుపట్టినట్టుగా చెప్పారు. ఈ సినిమాకు తను స్క్రీన్ ప్లే రాసినట్టుగా తెలిపారు. డైరెక్టరుగా మారే ఉద్ధేశం మాత్రం లేదని, తను డైరెక్టర్ అయితే షూటింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చేయి చేసుకోవాల్సి వస్తుందని మోహన్ బాబు సరదాగా వ్యాఖ్యానించారు.