మలయాళీ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియుం' రీమేక్ వెర్షన్ టైటిల్ లేనే తేడా కనిపిస్తూ ఉంది. మలయాళీ టైటిల్ లో రెండు ప్రధాన పాత్రల పేర్లూ వినిపిస్తాయి. ఆ ఇద్దరు పాత్రల పేర్లనే అక్కడ టైటిల్ గా చేశారు. అందులోనూ మలయాళీ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన కోషీ పాత్రకు టైటిల్ లో కూడా ద్వితీయ ప్రాధాన్యతనే ఇచ్చారు.
విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేసే బిజూ మేనన్ పేరు అయ్యప్పన్ పేరుకు ప్రథమ తాంబూళం ఇస్తూ..అయ్యప్పనుమ్ కోషియుం అంటూ నామకరణం చేశారు. అలా టైటిల్ లోనే ఇరు పాత్రలకూ ఉన్న ప్రాధాన్యతను తేటతెల్లం చేశారు.
అయితే ఆ సినిమా తెలుగు రీమేక్ లో మాత్రం ఆదిలోనే తేడా స్వరం హైలెట్ అవుతోంది. కోషీ పాత్రకు తెలుగులో ఉండే ప్రాధాన్యం ఏమిటో టైటిల్ తోనే స్పష్టం అవుతోంది. కనీసం లీకు వీరులు, ఫ్యాన్స్ అయినా..ఆ పాత్రకు కొంత ప్రాధాన్యతను ఇచ్చారు. అయితే మూవీ మేకర్లు మాత్రం సింపుల్ గా భీమ్లా నాయక్ అంటూ టైటిల్ ప్రకటించేసి.. తమ రీమేక్ ఎలా ఉండబోతోందో క్లారిటీ ఇచ్చారు.
అయ్యప్పన్ కోషియుం సినిమాను పవన్ కల్యాణ్ రీమేక్ చేయబోతున్నాడనే వార్తలు వచ్చిన తొలి రోజుల్లోనే.. దానికి 'బిల్లా రంగా' అంటూ టైటిల్ అంటూ కొంతమంది తోచిన గెస్ ఏదో చేశారు. మలయాళీ వెర్షన్ చూసిన ప్రతి ఒక్కరూ..తెలుగులోనూ ఇరు పాత్రలతో కూడిన టైటిల్ నే పెడతారని అనుకుంటారు. అలా పెడితేనే.. న్యాయమనుకుంటారు.
అయితే.. తెలుగు వెర్షన్లో ఒకే పాత్రే ధ్వనిస్తోంది! రెండోది టైటిల్ ఊసులో లేదు. మరి ఈ మార్పు ఇంత వరకేనా.. కొంపదీసి కోషీని పూర్తిగా విలన్ గా మార్చేసి.. రీమేక్ కోసం చేసిన ఘనమైన మార్పు అంటారో! అనే కామెంట్లు తప్పడం లేదిప్పుడు!