వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయం ఓ ప్రత్యేకం. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో ముందూవెనుకా చూసుకునే రకం కాదు. పర్యవసానాలేవైనా ఎదుర్కోడానికి సిద్ధపడే.. ప్రత్యర్థులతో ఆయన ఢీకొంటుంటారు. అది సోషల్ మీడియా లేదా ఇతర వేదికలు కావచ్చు. ఒక్కోసారి ఆయన ట్వీట్లలో అభ్యంతరకర భాషను వాడుతున్నారనే విమర్శలు వస్తున్నా, ఆయన మాత్రం వాటి గురించి పట్టించుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో తాజా ట్వీట్ కలకలం రేపుతోంది. పేరెత్తకుండానే, చెడుగుడు ఆడడం ఈ ట్వీట్‌లోని ప్రత్యేకత. ఇంతకూ ఆ ట్వీట్ కథేంటో చూద్దాం. కాస్త లోతుగా ఆలోచిస్తే… విజయసాయిరెడ్డి టార్గెట్ ఎవరో కనుక్కోవడం కష్టమేమీ కాదు.
“తాడు బొంగరం లేదు, తెగిన గాలిపటంలా ఎగురుతూ పిచ్చి కుక్కలా మొరుగుతున్నాడు. బ్యాంక్స్ ని నిండా ముంచి ఎప్పుడు ఏ దేశానికి ఎగిరిపోతాడో తెలియదు.యూరో బేరగాడు యూరప్ కే పోతాడా? నియోజకవర్గంకి వస్తే జనం చెప్పులతో స్వాగతం చెప్తారు. వాడు కూడా పచ్చ మీడియా సాక్షిగా నీతులు చెప్పేవాడే రామ రామ”
ట్వీట్‌లో మొదటి పదం నుంచి చివరి పదం వరకూ వాడివేడిగా సాగింది. ఇంతకూ తాడు బొంగరం లేని, తెగిన గాలిపటంలా ఎగురుతూ పిచ్చి కుక్కలా… అది కూడా ఎల్లో మీడియా సాక్షిగా మొరుగుతున్నాడని విజయసాయిరెడ్డి ఏకిపారేశారు. ఇంతకూ ఎవరా యూరో బేరగాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అలాగే నియోజక వర్గానికి వస్తే జనం చెప్పులతో స్వాగతం పలికేంత ఆగ్రహానికి గురైన ప్రజాప్రతినిధి ఎవరై ఉంటారబ్బా?
కానీ ట్వీట్‌లో చిట్టచివరిగా …రామ రామ అనడం కేవలం ఊతపదంగా చెప్పారా లేక తాను ఎవరిని తిట్టానో, సదరు వ్యక్తి పేరుకు సంబంధించి సంకేతంగా ప్రస్తావించారా? అనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ బద్ద వ్యతిరేకంగా భావించే నేతల్లో రామ అనే పేరు లేదా పదం కలిసి వచ్చే వారెవరబ్బా…నెటిజన్లకేమైనా గుర్తొస్తోందా? కృష్ణకృష్ణ… విజయసాయి భలే పజిల్ పెట్టారే!