టీడీపీలో ఏపీ అధ్యక్ష పదవి రబ్బరు స్టాంప్ లాంటిదనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో కళా వెంకట్రావు, ఇప్పుడు అచ్చెన్నాయుడు దొందూ దొందే అనే విషయం ప్రాక్టికల్ గా నిరూపితమైంది. అయితే ఈ క్రమంలో టీడీపీ తనకు తాను రాజకీయ సమాధి కట్టుకుంటుందన్న విషయాన్ని అధినాయకులు గ్రహించడం లేదు.
అచ్చెన్నకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎక్కడ లోకేష్ ను దాటి వెళ్లిపోతాడా అని చంద్రబాబు భయం. అలా అని లోకేష్ ను క్షేత్రస్థాయికి పంపించలేని దయనీయ స్థితి. దీంతో అచ్చెన్నకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వక, లోకేష్ కు పని కల్పించక టీడీపీ తన గోయి తానే తవ్వుకుంంటోంది.
నందమూరి వారి చేతుల్లో నుంచి నారావారికి పెత్తనం వెళ్లాక టీడీపీ పరిస్థితి ఎలా దిగజారిందో వేరే చెప్పక్కర్లేదు. రాష్ట్ర విభజన అనంతరం అధినాయకుల్లో అభద్రతా భావం, మిగిలిన జనాల్లో నాయకత్వలేమి.. వెరసి పార్టీ పరిస్థితి చుక్కానిలేని నావలా తయారైంది. చంద్రబాబు తనని తాను జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకుని, ఏపీ, తెలంగాణలో డమ్మీలకు అధ్యక్ష పదవులిచ్చి సామాజిక న్యాయం అంటున్నారు.
కనీసం వారినైనా స్వతంత్రంగా ఆలోచించనిస్తున్నారా అంటే అదీ లేదు. కేవలం తాను తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే అధికారం.. కాదు కాదు అవకాశమే వారిది. తెలంగాణలో పార్టీని పట్టించుకునేవారే లేరు కాబట్టి, ఏపీలో టీడీపీ అధ్యక్ష పదవి అనేది ఆటలో అరటిపండు లాంటిది.
కానీ కళా వెంకట్రావు నుంచి అచ్చెన్నలాంటి ఫైర్ బ్రాండ్ దగ్గరకు పార్టీ అధ్యక్ష పదవి వెళ్లే సమయంలో చాలామందిలో ఆశలు చిగురించాయి. దానికి తగ్గట్టే.. ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి చేపట్టిన టైమ్ లో అచ్చెన్న చాలా ప్రకటనలు చేశారు. జిల్లాలన్నీ పర్యటిస్తానన్నారు. నియోజకవర్గాల స్థాయిలో సమీకరణాలు మార్చేస్తానన్నారు.
యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా పదవులు కేటాయిస్తానన్నారు. ఈ పనులేవీ అచ్చెన్న చేతుల మీదుగా జరగలేదు. అన్నీ చంద్రబాబు, చినబాబు చూసుకున్నారు. కీలకమైన జిల్లాల పర్యటన అంశం మాత్రం ఇంకా అలానే ఉంది. అచ్చెన్న జిల్లాల్లో పర్యటిస్తే, లోకేష్ కు మూడినట్టే. అందుకే ఆయన్ను చేయనివ్వరు, ఈయన చేయరు.
సహజంగా పెద్ద నాయకులెవరైనా తమ అనుచరుల్ని తన భుజాల వరకే ఎదగనిస్తారు, అంతకంటే పైకి ఎదుగుతారు అనుకుంటే మాత్రం సింపుల్ గా పక్కకు తప్పించేస్తారు. కానీ టీడీపీలో లోకేష్ ది మరీ మరుగుజ్జు స్థానం. తాను మంత్రిగా ఉండి, తన తండ్రీ సీఎంగా ఉండి కూడా ఆయన కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని దుస్థితి.
మిగతా నాయకుల్ని కూడా తనకంటే తక్కువ స్థాయిలో ఉండమంటే ఎలా..? ప్రజాబలం కానివ్వండి, ఇంకేదైనా కారణం కానివ్వండి.. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని కనీసం టీడీపీ గౌరవించాలి కదా. పార్టీలో అలాంటి గౌరవం దక్కక, భావి నాయకుడిగా చెప్పుకుంటున్న లోకేష్ కి బుద్ధి లేదు కాబట్టి ఒక్కొక్కరే బయటకొస్తున్నారు. ఓ దశలో అచ్చెన్నాయుడు అసహనంతో పార్టీ లేదు, బొక్కాలేదు అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
తనపై తనకు నమ్మకం లేదు, కనీసం పక్కవారిని ప్రోత్సహించాలన్న ఇంగితం లేదు. అచ్చెన్నాయుడు వచ్చాక లోకేష్ లో మరీ అభద్రతా భావం పెరిగిపోయింది. అందుకే పార్టీ పడిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఎవరూ దానికి అండగా నిలబడేందుకు ఇష్టపడటం లేదు.