ఆ బాధ్య‌త నుంచి విజ‌న‌రీ త‌ప్పుకున్నారా?

విజ‌న్ -2020 క‌ల ఏమైందో చంద్ర‌బాబుకే తెలియ‌దు. తాజాగా బాబు అంబుల పొది నుంచి విజ‌న్‌-2047 దూసుకొచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దే క్ర‌మంలో త‌న కుమారుడు లోకేశ్ భ‌విష్య‌త్ గురించి మ‌రిచిపోయార‌ని, అందుకే ఆ…

విజ‌న్ -2020 క‌ల ఏమైందో చంద్ర‌బాబుకే తెలియ‌దు. తాజాగా బాబు అంబుల పొది నుంచి విజ‌న్‌-2047 దూసుకొచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దే క్ర‌మంలో త‌న కుమారుడు లోకేశ్ భ‌విష్య‌త్ గురించి మ‌రిచిపోయార‌ని, అందుకే ఆ యువ నాయ‌కుడు తండ్రికి త‌గ్గ వార‌సుడు అనిపించుకోలేక పోయార‌నే వ్యంగ్య విమ‌ర్శ వుంది. 2024 ఎన్నిక‌లు టీడీపీ భ‌విష్య‌త్‌ను తేల్చ‌నున్నాయి. ఈ ఎన్నిక‌లు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి, చంద్ర‌బాబుకు అత్యంత కీల‌కం.

మ‌రీ ముఖ్యంగా త‌న కుమారుడు లోకేశ్‌ను రాజ‌కీయంగా ఒక ఇంటివాడిని చేయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యంగా చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో టీడీపీలో లోకేశ్ ప్రాధాన్యం పెరిగింది. టికెట్ల కేటాయింపులో లోకేశ్ మాట‌కు విలువ ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

తానొక గొప్ప విజ‌న‌రీ అని, ఏపీకి త‌న అవ‌స‌రం ఉంద‌నే చాటి చెప్పేందుకు చంద్ర‌బాబు తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 100 సంవ‌త్స‌రాలు పూర్తి కావ‌డాన్ని పుర‌స్క‌రించుకుని, ఎంతో దూర‌దృష్టిలో ఆయ‌న ఒక డాక్యుమెంట్‌ను ముందుకు తెచ్చారు. బాబుకు ప్ర‌చారం చేయ‌డానికి మీడియా సంస్థ‌లు పోటీ ప‌డ‌డంపై ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

అదేంటో గానీ, మ‌ళ్లీ ఆయ‌న తెలుగు జాతి వ‌ర‌కే ప‌రిమిత‌మై మాట్లాడ్డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. తెలుగు జాతిని ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తిమంత‌మైనదిగా తీర్చిదిద్దే బాధ్య‌త త‌న‌దే అని చంద్ర‌బాబు అన్నారు. కోట్ల మంది యువ‌తే త‌న‌ సైన్యం అన్నారు. హైద‌రాబాద్ అభివృద్ధి హైటెక్ సిటీతో ప్రారంభ‌మైంద‌న్నారు. ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో చూశారా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

విజ‌న్‌-2047 గురించి ఆర్భాటంగా చెప్పి, ఇప్పుడేమో భార‌త జాతిని తీర్చిదిద్దే బాధ్య‌త‌ను చంద్ర‌బాబు త‌న భుజాల‌పై వేసుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. దేశానికి ఇప్పుడు మోదీని ఎదుర్కొనే ప్ర‌ధాని అభ్య‌ర్థి అవ‌స‌రం ఉంది. ఆ భ‌ర్తీని తాను పూరిస్తాన‌ని చెప్ప‌డానికి చంద్ర‌బాబు ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. విజ‌న్‌-2047 అనేది కేవ‌లం ప్ర‌చారానికి మాత్ర‌మే ప‌రిమితం చేసేలా క‌నిపిస్తోంది. 

హైద‌రాబాద్ అభివృద్ధికి తానే పునాదులు వేశాన‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెబుతున్నారు. హైద‌రాబాద్‌కు తాను తీసుకొచ్చిన ఐటీ ప్రాజెక్టుల వ‌ల్లే నేడు ఎంతో అభివృద్ధికి కార‌ణ‌మైంద‌ని స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబుపై మంత్రి కేటీఆర్ సెటైర్స్ ఆయ‌న‌పై బాగా ప‌ని చేసిన‌ట్టున్నాయి.

అందుకే హైద‌రాబాద్ అభివృద్ధి ఘ‌న‌త త‌న‌దే అని ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో ప్ర‌చారం చేసుకోడానికి చంద్ర‌బాబు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అంతే త‌ప్ప‌, 2014 నుంచి ఐదేళ్ల పాటు విభ‌జిత ఏపీకి చేసిందేంటో చెప్పుకోడానికి చంద్ర‌బాబు వ‌ద్ద ఏమీ లేన‌ట్టే క‌నిపిస్తోంది. విజ‌న్‌-2047 ప్ర‌క‌టించి తెలుగుజాతిని మాత్ర‌మే తీర్చిదిద్దే బాధ్య‌తకు ప‌రిమితం కావ‌డం, భార‌త జాతిని విడిచిపెట్ట‌డంపై ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు వెట‌క‌రిస్తున్నారు.