బాబుపై ప‌వ‌న్‌కు నిలువెల్లా అనుమానమా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఒంట‌రిగా తిరుగుతున్న‌ప్ప‌టికీ, మ‌న‌సంతా చంద్రబాబునాయుడి ఆలోచ‌న‌ల‌పైన్నే ఉంది. చివ‌రికి చంద్ర‌బాబు త‌న‌ను ఏం చేస్తాడో అనే భ‌యం ఆయ‌న్ను వెంటాడుతోంది.  Advertisement తెలుగు స‌మాజంలో చంద్ర‌బాబుకు ఒక…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఒంట‌రిగా తిరుగుతున్న‌ప్ప‌టికీ, మ‌న‌సంతా చంద్రబాబునాయుడి ఆలోచ‌న‌ల‌పైన్నే ఉంది. చివ‌రికి చంద్ర‌బాబు త‌న‌ను ఏం చేస్తాడో అనే భ‌యం ఆయ‌న్ను వెంటాడుతోంది. 

తెలుగు స‌మాజంలో చంద్ర‌బాబుకు ఒక బ్రాండ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఎవ‌రినైనా క‌రివేపాకులా వాడుకుని వ‌దిలేస్తార‌నే ప్ర‌చారం ఆయ‌న‌పై వుంది.

బాబు స్వ‌భావం గురించి ప‌వ‌న్‌కు తెలుసు. కానీ అతిపెద్ద శ‌త్రువుగా భావిస్తున్న సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను గ‌ద్దె దించడ‌మే ల‌క్ష్యంగా ప‌వ‌న్‌ పెట్టుకున్నారు. ఇందుకోసం చంద్ర‌బాబుతో రాజ‌కీయ స్నేహం చేయ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. 

ప‌వ‌న్ రాజ‌కీయ బ‌ల‌హీన‌త‌, అజ్ఞానాన్ని అడ్డు పెట్టుకుని  సొమ్ము చేసుకోడానికి చంద్ర‌బాబు ప‌ని సులువ‌వుతోంది. దీంతో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటామ‌ని చంద్ర‌బాబు నోరు జార‌డం లేదు.

నిజానికి ప‌వ‌న్‌తో చంద్ర‌బాబుకే ఎక్కువ అవ‌స‌రం వుంది. ఎందుకంటే త‌క్ష‌ణం సీఎం అయితే త‌ప్ప‌, టీడీపీ, అలాగే లోకేశ్‌కు భ‌విష్య‌త్ లేద‌ని చంద్ర‌బాబు తీవ్ర ఆందోళ‌న‌లో వున్నారు. 

ప‌వ‌న్‌కు సీఎం ఆశ‌లేవీ లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబు సంబ‌ర‌ప‌డుతున్నారు. వారాహి యాత్ర‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో మాట్లాడుతూ ….స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి జ‌న‌సేన ప్ర‌భుత్వం లేదా సంకీర్ణ ప్ర‌భుత్వంలోనైనా చొర‌వ చూపుతామ‌ని హామీ ఇస్తున్నారు.

ఇంకా అధికారికంగా రాజ‌కీయ అవ‌గాహ‌న‌కు రాక‌నే, సంకీర్ణ ప్ర‌భుత్వం గురించి మాట్లాడ్డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. మ‌రోవైపు గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీట్లు ఇస్తేనే, టీడీపీతో పొత్తు వుంటుంద‌ని ఆ మ‌ధ్య ప‌వ‌న్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. పొత్తులో భాగంగా త‌న పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో అనే ఆందోళ‌న‌, అనుమానం ఉండ‌డం వ‌ల్లే ప‌వ‌న్ రోజుకో మాట మాట్లాడుతున్నార‌ని చెప్పొచ్చు. 

త‌న‌కు తానుగా పొత్తుల‌పై ప‌దేప‌దే మాట్లాడుతుండ‌డంతో ఎన్నిక‌ల ముంగిట‌, జ‌న‌సేన‌కు ఎన్నోకొన్ని కేటాయించి, చంద్ర‌బాబు చేతులు దులుపుకోవ‌డం ఖాయ‌మ‌ని జ‌న‌సేన నేత‌లు సైతం ఆందోళ‌న చెందుతున్నారు.

చంద్ర‌బాబులా త‌న రాజ‌కీయాలు తాను చేసుకుంటే స‌రిపోతుంద‌ని, ఆలులేదు, చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం చందంగా సంకీర్ణ ప్ర‌భుత్వం గురించి ప‌వ‌న్ మాట్లాడ్డం ఏంట‌ని విశ్లేష‌కులు విమ‌ర్శిస్తున్నారు. 

టీడీపీ, బీజేపీ పొత్తుల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌ని నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎందుకంత ఆత్రుత ప్ర‌ద‌ర్శిస్తున్నారో అర్థం కావ‌డం లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అవ‌స‌రం లేకుండానే చంద్ర‌బాబు చేతిలో రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను ఎందుకు పెడుతున్నారో అనే చర్చ జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌తంగా సాగుతోంది.