పీవీ రమేష్ అనే ఐఏఎస్ అధికారి జులై 31న రిటైర్ అయ్యారు. నిజానికి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఆయన మే నెలలోనే రాష్ట్ర సర్వీసుకు వచ్చారు. ముక్కుసూటిగా వెళ్లే అధికారిగా పేరున్న పీవీ రమేష్ ను సీఎం జగన్ కోరి మరీ తన పేషీకి తెచ్చుకున్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో నియమించుకున్నారు. అయితే నిండా రెండు నెలలు కూడా గడవనేలేదు. ఆయన రిటైర్మెంట్ అయిపోయారు. ఆయనకు ఎక్స్ టెన్షన్ ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినప్పటికీ.. అటునుంచి స్పందన లేదని… అందువల్లనే తప్పక రిటైర్ కావాల్సి వచ్చిందని వార్తలు వస్తున్నాయి.
పీవీ రమేష్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ముక్కుసూటి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు చెప్పినట్టల్లా నిర్ణయం తీసుకోకపోయేసరికి ఆయనకు బదిలీ తప్పలేదు. ఆ తర్వాత ఆయన కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే… రిటైర్మెంటుకు కేవలం రెండునెలల దూరంలో ఉన్న పీవీ రమేష్ ను ప్రత్యేకంగా కేంద్రప్రభుత్వాన్ని కోరి, రాష్ట్ర సర్వీసుకు తీసుకువచ్చారు. సీఎంగా తొలి ప్రెస్ మీట్ నుంచి జగన్ తో పాటు ఆయన కూడా ఉన్నారు. ఆయనకు ఎక్స్ టెన్షన్ ఇవ్వడం ద్వారా జగన్ ఆయన సేవలను మరికొంత కాలంపాటు వాడుకోదలచుకున్నారని అంతా అనుకున్నారు.
కానీ జులై ముగిసేనాటికి అలాంటిదేమీ జరగలేదు. జులై 26న రాష్ట్రప్రభుత్వం ఆయన సర్వీసును పొడిగించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసింది. అటునుంచి స్పందన రాకపోయే సరికి.. పీవీరమేష్ ను రిలీవ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే దీనిపై రెండు రకాల కథనాలు వినవస్తున్నాయి. పీవీరమేష్ తమకు కూడా కొరుకుడు పడనందునే.. ఆయన ఎక్స్‌టెన్షన్ గురించి సర్కారు సీరియస్ గా పట్టించుకోకుండా రిలీవ్ చేసిందనేది ఒక వాదన.
అదే సమయంలో… రిటైర్ అయినా సరే… పీవీ రమేష్ ను ముఖ్యమంత్రికి ప్రత్యేక సలహాదారుగా నియమించుకోవడం ద్వారా ఆయన సేవలను వాడుకోనున్నారనేది రెండో వాదన. జగన్ ప్రత్యేక శ్రద్ధతో ఆయనను తన పేషీకి తెప్పించుకున్నందున.. ఇప్పుడు సలహాదారు పోస్టు కట్టబెట్టడమే జరుగుతుందని అంచనాలు సాగుతున్నాయి.