టీవీ మీడియా ఛానెళ్లు.. గాల్లో దీపాలు

టీవీ9 చేతులు మారడానికి ముందు, చేతులు మారిన తర్వాత తేడా స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి టీవీ9 కొనుగోలు వ్యవహారంలో అంతా అది ఓ బిజినెస్ టైకూన్, ఓ ఛానెల్ సీఈవో మధ్య వివాదంగా చూశారు.…

టీవీ9 చేతులు మారడానికి ముందు, చేతులు మారిన తర్వాత తేడా స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి టీవీ9 కొనుగోలు వ్యవహారంలో అంతా అది ఓ బిజినెస్ టైకూన్, ఓ ఛానెల్ సీఈవో మధ్య వివాదంగా చూశారు. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది కేవలం టీవీ9 వ్యవహారం మాత్రమే అనిపించదు. మొత్తం టెలివిజన్ మీడియాలోనే చిన్నగా ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఎన్నో ఛానెల్స్ కొత్తరూపు తీసుకోగా, మరికొన్ని ఛానెళ్లు చేతులుమారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

టీవీ9 ఇప్పటికే అలంద మీడియా (మైంహోమ్ రామేశ్వరావు) చేతికొచ్చింది. దానికి అనుబంధంగా ఉన్న టీవీ1 అనే ఛానెల్ కూడా త్వరలోనే కొత్తరూపు సంతరించుకోనుంది. దాన్ని పూర్తిస్థాయి భక్తి ఛానెల్ గా మార్చే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరోవైపు రవిప్రకాష్ జమానా నడిచిన రోజుల్లో టీవీ9కు అనుబంధంగా ఉన్న మోజో ఛానెల్ కు ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదురైంది. ఈ ఛానెల్ ను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. సోమవారం ఆఖరి పనిదినం. దాదాపు 200 మంది ఉద్యోగులు రోడ్డున పడబోతున్నారు.

ఇదంతా టీవీ9 దాని అనుబంధ ఛానెళ్ల వ్యవహారం. ఇక మిగతా ఛానెళ్ల విషయానికొద్దాం. 10టీవీ అనే న్యూస్ ఛానెల్ లో ఇప్పటికే యాజమాన్య బదిలీ ప్రక్రియ పూర్తయింది. అటుఇటు చేతులు మారి ఇది కూడా అలంద మీడియాకే దక్కింది. మరోవైపు ప్రైమ్9 అనే న్యూస్ ఛానెల్ కూడా చాలా ఇబ్బందులు పడుతోంది. రేపోమాపో అన్నట్టుంది వ్యవహారం. అటు పవన్ కు చెందిన 99 న్యూస్ ఛానెల్ కూడా చేతులు మారడానికి సిద్ధంగా ఉంది. ఇక రాజ్ న్యూస్, స్టుడియో ఎన్, సీవీఆర్ న్యూస్ ఛానెల్స్ కుటీర పరిశ్రమల్లా తయారయ్యాయి. వాటిని ఇటు ప్రజలు, అటు రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవడం లేదు.

ఇక టీవీ9 తర్వాత పెద్ద ఛానెళ్ల విషయానికొస్తే అందరి చూపు ఇప్పుడు ఎన్టీవీ న్యూస్ ఛానెల్ పై పడింది. దీనిపై ఇప్పుడు బీజేపీ నేతల కన్నుపడినట్టు తెలుస్తోంది. ఛానెల్ ను తమకు ఇచ్చేయాల్సిందిగా, చైర్మన్ నరేంద్రనాధ్ చౌదరిపై జాతీయస్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయట. అందులో నిజముందనే విషయాన్ని ఛానెల్ లో పైస్థాయిలో పనిచేసే ఉద్యోగులే నిర్థారిస్తున్నారు. ఇక ఈవీవీ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ లో ఇప్పటికే చాలామటుకు రిలయన్స్ వశమైంది. ఆపరేషన్స్ అన్నీ రామోజీ గ్రూప్ ఉద్యోగులు చేస్తున్నప్పటికీ, పెట్టుబడులు మాత్రం అధిక శాతం రిలయన్స్ నుంచి వచ్చిన విషయం బహిరంగ రహస్యం.

టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, సాక్షి న్యూస్ ఛానెల్స్ కు ప్రస్తుతానికి వచ్చే ఇబ్బందులేం లేవు. జగతి పబ్లికేషన్స్ కు చెందిన సాక్షి న్యూస్ ఛానెల్ కు మరో పదేళ్ల వరకు ఢోకా లేదు. ఇటు టీవీ5, ఏబీఎన్ ఛానెళ్లు అవి  అనుసరించే విధానాల బట్టి వాటి మనుగడ ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఓ బలమైన వర్గం ఇప్పుడు మీడియాపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఛానెల్ పనిచేస్తున్నట్టు తెలిస్తే తెలంగాణలో ఆ ఛానెల్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది.

ప్రస్తుతానికైతే చాలా న్యూస్ ఛానెల్స్ పరిస్థితి ఇప్పుడు గాల్లో దీపంగా మారింది. రాజకీయ ప్రభావం, ఆర్థిక కారణాల వల్ల ఏ క్షణానైనా ఇవి చేతులు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో ఏడాది ఆగితే తప్ప ఈ రంగంలో స్థిరత్వం కనిపించేలా లేదు.

'కామ్రేడ్'కు నిర్వచనం అదా!