సినిమాకు సంబంధించి రిలీజ్ కు ముందు హీరోలు ఎన్నో చెబుతుంటారు. సినిమా ఫ్లాప్ అయితే మెల్లగా పక్కకు తప్పుకుంటారు. మీడియాకు ముఖం కూడా చూపించరు. హిట్ అయితే క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంటారు. రామ్ కూడా ఇప్పుడు ఇదే పనిచేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాను అస్సలు ప్రమోట్ చేయని ఈ హీరో, ఇప్పుడా మూవీ సక్సెస్ అవ్వడంతో ఆ విజయం తనదే అంటున్నాడు. తను చెప్పినట్టే జరిగిందని వేదాంతం చెబుతున్నాడు.
“సినిమా విడుదలకు ముందే నేను చెప్పాను. దీనమ్మ సినిమా సూపర్ కిక్ ఇచ్చిందని చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. ప్రతి ఒక్కరూ అదే కిక్ ను ఫీలవుతున్నారు. మణిశర్మ విషయంలో కూడా అదే జరిగింది. మణి 2.Oను చూస్తారన్నాను. నిజంగానే మణిశర్మ బౌన్స్ బ్యాక్ అయ్యాడు.”
ఇలా సినిమాకు సంబంధించి ప్రతి విషయం గతంలో తను చెప్పినట్టే అయిందంటున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన ఈ హీరో, ఇలా ఈ విజయాన్ని తనకుతాను ఆపాదించుకునే ప్రయత్నం చేశాడు.
ఈ సినిమా కథను తను, పూరి కలిసి గోవాలో ఎక్స్ క్లూజివ్ గా కూర్చొని రాసుకున్నామని చెప్పుకొచ్చాడు రామ్. మరీ ముఖ్యంగా బ్యాడ్ బాయ్ క్యారెక్టర్ ఐడియా తనదే అంటున్నాడు. నిజానికి ఇలాంటి బ్యాడ్ బాయ్ క్యారెక్టర్లు రాయడం పూరికి కొత్తకాదు. పూరి సినిమాల్లో హీరోలందరూ కాస్త బ్యాడ్ గానే కనిపిస్తారు. కానీ ఇస్మార్ట్ శంకర్ పాత్రను మాత్రం తను చెబితేనే పూరి క్రియేట్ చేశాడని రామ్ చెప్పడం విడ్డూరం.