కరోనా కల్లోలం.. మూడో డోస్ కూడా తప్పదా?

కరోనాకు ప్రపంచమంతా డబుల్ డోస్ టీకా తీసుకుంటోంది. ఈమధ్య సింగిల్ డోస్ టీకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కోవాలంటే మూడో డోస్ కూడా తప్పనిసరి అంటున్నారు నిపుణులు. మారిపోతున్న…

కరోనాకు ప్రపంచమంతా డబుల్ డోస్ టీకా తీసుకుంటోంది. ఈమధ్య సింగిల్ డోస్ టీకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కోవాలంటే మూడో డోస్ కూడా తప్పనిసరి అంటున్నారు నిపుణులు. మారిపోతున్న వేరియంట్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 2 డోసులు వేయించుకున్న వాళ్లు, మూడో డోస్ కూడా వేయించుకునే అవసరం ఏర్పడిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో మూడో డోస్ కు అత్యవసర వినియోగ అనుమతి లభించింది.

అమెరికాలో ఇప్పటికే సగం జనాభాకు 2 డోసుల వ్యాక్సిన్ వేశారు. అయినప్పటికీ మూడో వేవ్ లో చాలామంది కరోనా బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో లక్షకు పైగా కొత్త కరోనా వేరియంట్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో 2 డోసులు వేసుకున్న ప్రజలకు మూడో డోస్ కూడా వేసేందుకు అక్కడ అనుమతి లభించింది.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు టీకా మూడో డోసు ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు ఫైజర్, మెడెర్నా టీకాల మూడో డోస్ వినియోగానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతినిచ్చింది. అవయవ మార్పిడి చేయించుకున్న వ్యక్తులతో పాటు, ఇతర అనారోగ్య సమస్యలున్న వాళ్లకు మూడో డోస్ ఇవ్వొచ్చని సూచించింది.

ఇండియా పరిస్థితేంటి?

భారత్ లో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ జోరుగా సాగుతున్నప్పటికీ.. 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు చాలా తక్కువమంది. ఇంకా చెప్పాలంటే మొదటి డోస్ ప్రక్రియే పూర్తికాలేదు. ఇలాంటి టైమ్ లో దేశంలో మూడో డోస్ కు అనుమతి ఇస్తే విమర్శలు ఎదుర్కోక తప్పదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మూడో డోస్ అత్యవసర వినియోగంపై భారత ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉంది. 

ఎందుకంటే, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు కూడా మూడో వేవ్ లో కరోనా బారిన పడుతున్నారు. ఈమధ్య ఢిల్లీలో ఓ మహిళ 2 డోసులు తీసుకున్నప్పటికీ, డెల్టా వేరియంట్ వల్ల మృతి చెందింది. ఇలాంటి కేసుల్ని దృష్టిలో పెట్టుకొని భారత్ లో కూడా కరోనా వ్యాక్సిన్ మూడో డోస్ అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తుందేమో చూడాలి.