విశాఖ గ్రీన్ సిటీ అని అంటారు. కానీ ఇపుడు క్లీన్ సిటీ కూడా. విశాఖ పరిశుభ్రతకు కేరాఫ్ గా మారిపోయింది. అందుకే స్వచ్చ ర్యాంకుల్లో అలా ముందుకు దూసుకువచ్చేస్తోంది. 2014లో కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన స్వచ్చ సర్వేక్షణ్ లో విశాఖకు తొలిసారి వచ్చిన ర్యాంక్ 235. అంటే ఆనాడు చిట్ట చివరన ఈ నగరం స్వచ్చ సర్వేక్షణ్ లో ఉందన్నమాట.
ఆ తరువాత తన స్థితిని పరిస్థితిని వేగంగానే మార్చుకుంది. అలా వందలోపు ర్యాంకుల దాకా వచ్చి దశలవారీగా 29, 28 ర్యాంకుల నుంచి కూడా బాగా తగ్గి ఇపుడు ఏకంగా నాలుగవ ర్యాంక్ కి వచ్చింది మహా నగరం. గత ఏడాది స్వచ్చ సర్వేక్షణ్ లో విశాఖ ర్యాంక్ 9 అయితే ఈసారి టాప్ ఫోర్ అంటూ గేర్ మార్చేసింది.
దేశవ్యాప్తంగా 1400 నగరాలు పోటీ పడిన చోట నాలుగవ ర్యాంక్ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇక విశాఖ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉండాలని నగర పాలక సంస్థ పాలకవర్గంతో పాటు అధికారులు చిత్తశుద్ధితో చేసిన కృషికి ఇది ఫలితం. అంతే కాదు, ప్రజలకు కూడా అవగాహన కల్పించడంతో ఈ ఉత్తమమైన ర్యాంక్ దక్కింది.
ఇది మాకు అసలు చాలదు, వచ్చేసారికి నంబర్ వన్ ర్యాంక్ సాధించడమే తమ టార్గెట్ అని మేయర్ హరి వెంకట కుమారి ధీమాగా చెబుతున్నారు. ఆ దిశగా పక్కా యాక్షన్ ప్లాన్ తో తాము ఈ రోజు నుంచే రంగంలోకి దిగుతామని ఆమె అంటున్నారు. అంటే 2023 నాటికి విశాఖ నంబర్ వన్ ర్యాంకర్ అవుతుందని, కావాలని నగరవాసులు అంతా ఆశిస్తున్నారు.