అధికార పార్టీ వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నిక పరీక్ష పెట్టనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న రోజుల్లో జరగనున్నాయి. ఈ మేరకు కొత్త ఓట్ల నమోదుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఓటర్ల నమోదు ప్రక్రియపై టీడీపీ, వైసీపీ ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సమీక్ష సమావేశాన్ని ఆదివారం తిరుపతిలో నిర్వహించారు.
ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డిని వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పేర్నాటి గెలుపును వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా పట్టభద్రులకు సంబంధించి ఎన్నిక కావడంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. నిరుద్యోగం, ఉద్యోగ ప్రకటనలు లేకపోవడం, కేవలం సంక్షేమ పథకాల అమలుకే ప్రభుత్వం పరిమితమైందన్న విమర్శ, అభివృద్ధి కుంటుపడిందనే ఆరోపణల నేపథ్యంలో విద్యావంతులు, మేధావులు అధికార పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారనే వార్తలొస్తున్నాయి. ఈ ఎన్నిక ఫలితం తారుమారైతే వైసీపీపై తీవ్ర ప్రభావం పడనుంది.
రానున్న సార్వత్రిక ఎన్నికలపై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈ సందర్భంగా తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. కొత్త ఓటర్ల చేర్పు, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఈ ఎన్నికలో గెలిచి తీరాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి ఆర్కే రోజా, రాజంపేట, తిరుపతి ఎంపీలు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, డాక్టర్ ఎం.గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.