ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా చివరికి ఇరు పార్టీల్లోని ముఖ్య నేతల కుటుంబాల్లోని మహిళలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఏపీలో అవాంఛనీయ పొలిటికల్ వార్ నడుస్తోందనే విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై తీవ్ర అభ్యంతరకర పోస్టుకు చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ కారణమంటూ ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న విజయ్ ఇంటి వద్దకు సీఐడీ అధికారులు వెళ్లడం తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో చింతకాయల విజయ్‌పై మంత్రి మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు. మీడియాతో మేరుగా మాట్లాడుతూ చింతకాయల విజయ్ సోషల్ మీడియా అరాచక వాదిగా అభివర్ణించారు.
సోషల్ మీడియాలో చింతకాయల విజయ్ అభ్యంతరకర పోస్టులు పెడితే పోలీసులు విచారణ చేయకూడదా అని ఆయన ప్రశ్నించారు. విజయ్ అన్యాయంగా పోస్టులు పెడుతుంటే సీఐడీ అధికారులు వెళ్లి నోటీసులు ఇవ్వడం తప్పా? అని మంత్రి మేరుగ నాగార్జున నిలదీశారు. దొంగను దొంగగారు అంటూ కుర్చీలో కూచోపెట్టి, కాఫీ, టీలు ఇచ్చి మర్యాద చేయాలని దొంగలంతా కోరుకుంటున్నారని టీడీపీ నేతలపై సెటైర్లు విసిరారు.
ప్రజాస్వామ్యంలో జర్నలిజాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తున్నారని మంత్రి ప్రశ్నించారు. విజయ్ అనే వ్యక్తి దొంగ అని మరోసారి ఆయన స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తికి నోటీసులు ఇవ్వడానికి వెళితే ఇంత యాగీ చేయాల్సిన పనేంటి? అని నిలదీశారు. ఏపీలో టీడీపీ నేతలు తమకు రాజ్యాంగం వర్తించదన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళపై అభ్యంతరకర పోస్టు పెడితే మీరు సమర్థిస్తారా? అని టీడీపీ నేతల్ని మంత్రి మేరుగ ప్రశ్నించారు. మహిళల మాన, ప్రాణాల గురించి విజయ్ అభ్యంతరకర పోస్టులు పెట్టాడని మంత్రి చెప్పుకొచ్చారు.
చింతకాయల విజయ్ చేసే ఘోరమైన ఇతర వ్యాపారాలను చంద్రబాబు, లోకేశ్ సమర్థిస్తున్నారని మంత్రి ఆరోపించారు. వీరంతా రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారని మంత్రి ప్రశ్నించారు. చింతకాయల విజయ్ కంటే తాము ఎక్కువ మాట్లాడగలమని, తిట్టగలమని ఆయన అన్నారు. అయితే సంస్కారం అడ్డొచ్చి ఊరుకున్నామన్నారు. టీడీపీ నేతలకు సిగ్గు అనేదే లేదని ఆయన విమర్శించారు.