జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ ఏర్పాటు చేసే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ మేరకు ఆయన దూకుడు పెంచారు.
ఇవాళ తెలంగాణ మంత్రులు, 33 జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సింగిల్ ఎజెండాపై జరిగింది. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలి, అలాగే పార్టీ పేరు ఏం పెట్టాలనే అంశంపై చర్చ జరిగింది.
టీఆర్ఎస్ స్థానంలో భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ మేరకు ఈ నెల 5న దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పేరు ఖరారుతో పాటు తీర్మానం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అలాగే తదుపరి అంశాలపై కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీలో డిసెంబర్ 9న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహణ ద్వారా దేశ ప్రజానీకాన్ని, వివిధ రాజకీయ పక్షాలను తన వైపు తిప్పుకోవాలని కేసీఆర్ వ్యూహం రచించారు. ఈ సభకు ప్రధానంగా రైతు సంఘాల నేతలు, పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతలు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని కేసీఆర్ ఆసక్తి కనబరుస్తున్నారని తెలిసింది. మొత్తానికి జాతీయ పార్టీపై కేసీఆర్ అడుగులు ముందుకు కదులుతున్నాయి.