ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ కోపంగా ఉన్నారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. దీని వెనుక పెద్ద కథే వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌తో నిన్నమొన్నటి వరకూ కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. అయితే మారుతున్న సమీకరణల నేపథ్యంలో జగన్‌పై కేసీఆర్ ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాల్సిందే.
గత రెండు మూడు రోజులుగా ఏపీ పాలనపై తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్ తదితరులు పథకం ప్రకారం విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ మంత్రుల విమర్శలను ఏపీ మంత్రులు దీటుగా తిప్పికొడుతున్నారు. తెలంగాణ మంత్రులు ఒకటంటే, ఏపీ మంత్రులు, ప్రభుత్వ పెద్దలు తామేం తక్కువ కాదని పది మాటలు అంటున్నారు. అకస్మాత్తుగా వీళ్ల మధ్య గొడవ ఎందుకొచ్చిందనే అనుమానం, ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
మంత్రి గంగుల కమలాకర్ విమర్శల్లోని కీలక అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే… తెలంగాణ అధికార పార్టీ ఆగ్రహానికి కారణా లేంటో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ బీజేపీ బీ టీంలా పని చేస్తోందని గంగుల కమలాకర్ ఘాటు విమర్శ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జాతీయ పార్టీ పెట్టాలని అనుకుంటున్న తరుణంలో కేసీఆర్ తన మిత్రుడైన జగన్ ప్రభుత్వంపై రాజకీయ దాడి చేయడం వెనుక వ్యూహం లేదంటే ఎవరూ నమ్మరు.
బీజేపీకి ప్రత్యామ్నాయంగా వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అయితే జగన్ మద్దతు మాత్రం ఆయన పొందలేకపోతున్నారు. తోటి తెలుగు ముఖ్యమంత్రి, మిత్రుడైన జగనే మద్దతు ఇవ్వకపోతే, ఏ మాత్రం సంబంధం లేని వారి మద్దతు ఎలా కూడగడతారనే ప్రశ్న కేసీఆర్‌ని వెంటాడుతోంది. బీజేపీతో జగన్ సన్నిహితంగా ఉండడాన్ని కేసీఆర్ ఓర్వలేకపోతున్నారనేందుకు మంత్రి గంగుల తాజా విమర్శే నిదర్శనం.
ఈ నెల 5న జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటించనున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాల్లో చేయాలని భావిస్తున్న కేసీఆర్… ఏపీ విషయానికి వచ్చే సరికి పెద్ద మనిషి పాత్ర పోషించడం లేదనేందుకు ప్రస్తుత పరిణామాలే ఉదాహరణ. జగన్‌తో రాజకీయ వైరం ముమ్మాటికీ కేసీఆర్‌కు నష్టదాయకమే. కేసీఆర్‌తో చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవరు. ఎందుకంటే కేసీఆర్‌తో దోస్తీ చేస్తే, కేంద్రంలో మోదీ, అమిత్‌షాలకు కోపం వస్తుందని చంద్రబాబుకు బాగా తెలుసు.
ఈ నేపథ్యంలో తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీ నుంచి కేసీఆర్‌కు మద్దతు లేదనే చెప్పాలి. ఒకవేళ ఆయన పార్టీ ఏపీలో పోటీ చేసినా ఒరిగేదేమీ వుండదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దూషణలను ఏపీ ప్రజానీకం ఎప్పుడూ మరిచిపోదు. కేవలం జాతీయస్థాయి రాజకీయాల్లోకి వెళుతున్న తనకు జగన్ మద్దతుగా నిలవలేదనే ఏకైక కారణంతోనే కేసీఆర్ అక్కసు పెంచుకున్నారనే చర్చ నడుస్తోంది. రానున్న రోజుల్లో జగన్‌పై కేసీఆర్ నేరుగా విమర్శలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్‌కు రాజకీయంగా జగన్ మద్దతు ఎప్పటికీ వుండదు కాబట్టి. నాయకుల కోపతాపాలకు రాజకీయమే తప్ప మరొకటి కారణం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.