Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆదిపురుష్: బుర్ర వాడని బ్యూటిఫుల్ గ్రాఫిక్స్!

ఆదిపురుష్: బుర్ర వాడని బ్యూటిఫుల్ గ్రాఫిక్స్!

నా చిన్నతనంలో ఒక చందమామ కథ చదివాను. ఆదిపురుష్ టీజర్ చూడగానే.. ఫస్ఠ్ లుక్ లోనే ఆ కథను గుర్తుకువచ్చింది. ఒకసారి అందరితోనూ పంచుకోవాలని అనిపించింది..

‘‘అనగనగా ఒక నగరంలో రాజుగారు.. ప్రఖ్యాత చిత్రకారుల ప్రదర్శన, పోటీ ఏర్పాటు చేశారు. అనేక రాజ్యాల నుంచి అనేకమంది సుప్రసిద్ధ చిత్రకారులు తరలివచ్చి తాము గీసిన వాటిలో అత్యుత్తమ చిత్రాలను అక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఆ చిత్రప్రదర్శనలో ఎన్నెన్నో అత్యద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. అయితే ప్రదర్శనను చూడడానికి వచ్చిన అందరూ కూడా ఒక చిత్రం వద్ద చకితులై నిలబడి పోతున్నారు! ఆ తైలవర్ణ చిత్రం అత్యద్భుతంగా ఉన్నదని అందరూ ముక్తకంఠంతో అంటున్నారు. ఇంతకు ఆ బొమ్మలో ఏముంది?

ఒక గ్రామీణ వాతావరణంలో రెండు కోడెఎద్దులు కొట్లాడుకుంటున్నాయి! అవి రెండూ ఒకదానితో ఒకటి తలపడడానికి, కొమ్ములతో కుమ్ముకోవడానికి ఎగబడుతున్న దృశ్యం అది. చూసిన ప్రతి ఒక్కరూ ఎంత అద్భుతంగా ఉందో కదా అంటున్నారు. ఆ గ్రామీణ నేపథ్యం, ఆ రెండు ఎద్దులను చిత్రీకరించడానికి వాడిన రంగుల మేళవింపు ఇవన్నీ కూడా అందరికీ తెగ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి! ఆ చిత్రకారుడు ప్రతిభను అందరూ భీభత్సంగా కీర్తిస్తున్నారు. ఆ చిత్రానికే ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి బహుమతి వచ్చేస్తుందని అందరూ తీర్మానించేస్తున్నారు. 

అలాంటి ఆ చిత్ర ప్రదర్శనకు ఆ నగరానికి వేరే పని మీద వచ్చిన ఒక గ్రామీణ పామర యువకుడు వచ్చి చూశాడు. ఎగ్జిబిషన్ అంతా తిరుగుతూ తిరుగుతూ ఎద్దులు తలపడుతున్న బొమ్మ దగ్గరకు వచ్చి నిలిచినాడు. వెంటనే ఇదేమిటి ఇంత చెత్తగా గీసారే అని పెదవివిరిచాడు. 

ఆ ఒక్కమాటతో ఆ చిత్ర ప్రదర్శన నిర్వాహకులతో సహా అందరూ జడుసుకున్నారు. వీడెవడు దారిన పోయే దిమ్మరిలాగా ఉన్నాడు, పల్లెటూరి బైతులగా ఉన్నాడు, వీడొచ్చి ఇంత అద్భుతమైన చిత్రరాజాన్ని గురించి ఇలా విమర్శ చేస్తాడా అని అందరూ మధనపడ్డారు. సరేలెమ్మనుకుని, చెత్తగా ఉందని ఎందుకన్నావు అంటూ వాడినే అడిగారు. 

దీనికి ఆ పక్కా పల్లెటూరిబైతు అని నిందలు వేయించుకున్న సదరు గ్రామీణుడు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? ‘‘అసలు ఎద్దులు కొట్లాడుకునేటప్పుడు తోక కిందికి జార్చి ఉంటాయా సాధ్యమేనా’’ అని! అంటే ఎద్దులు పరస్పరం తలపడి కొమ్ములతో కుమ్ముకునే పోరాటం జరుగుతుండగా తోకను పైకెత్తి ఉంటాయి! ఈ సంగతి గ్రామంలో నిత్యం ఎద్దులు కొట్టుకోవడాన్ని గమనించే ఆ పల్లెటూరిబైతుకు తెలుసు. అంతేతప్ప అద్భుతమైన వర్ణాల మేళవింపుతో ఎద్దుల బొమ్మలను గీయగలిగిన సదరు చిత్రకారుడు కి తెలియదు!

ఇప్పుడు ఆదిపురుష్ టీజర్ చూస్తే ఆ కథ గుర్తుకొచ్చింది. ఎందుకో కారణం ఉంది. శ్రీరాముడు ఒళ్లంతా రుద్రాక్షలు ధరించి ఉండడం మాత్రమే ఇందుకు కారణం కాదు! రామకథలో విలన్ రావణుడు మాత్రమే శివ భక్తుడు. అందుకే మనం ఆ పాత్రకు శివ భక్తుడి ఆహార్యం ఉంటుంది. రుద్రాక్షలు అన్నీ ఉంటాయి! అయితే ఈ సినిమాల్లో రాముడు కూడా మెడలోను, భుజదండలకు, మణికట్టులకు అంతా వేరే బీభత్సమైన శివ భక్తుడి లాగా రుద్రాక్షలు ధరించి ఉంటాడు! సరే ఇదొక్కటే కూడా గ్రాఫిక్స్ పనితనంలో సరైన శ్రద్ధ అబ్జర్వేషన్ లేదని చెప్పడానికి కారణం కాదు! ఎందుకంటే ఆ రోజుల్లో శివుడొక్కడే దేవుడు అని వాదించవచ్చు. అలాగే రాముడు శివ భక్తుడు కాదని నిరూపణ ఉన్నదా అని నిలదీయవచ్చు కాబట్టి దాని జోలికి వెళ్లడం లేదు!

రాముడు జలస్తంభన, నీటిఅడుగున తపస్సు చేస్తున్నట్టుగా ఓ దృశ్యం మనకు ఈ టీజర్ లో కనిపిస్తుంది. రాముడు చక్కగా నూలు పంచె ధోవతిలా కట్టుకుని ఉంటాడు. ఆయన ధరించే ఎర్రటి అంగవస్త్రాన్ని మొలకు చుట్టుకుని నీటి అడుగున కూర్చుని ఉంటాడు. ఆ అంగోస్త్రపు అంచులు.. నీటి తాకిడికి పైకి లేచి అలల్లాడుతూ ఉంటాయి. అవును మరి నీళ్లలో మునిగినప్పుడు బట్టలు పైకి లేస్తాయి. సింపుల్ ఫిజిక్స్ ఇది.  నీళ్లలో మునిగే ప్రతి ఒక్కరికీ ఈ అనుభవం ఉంటుంది. అందుకే మొలకు బిగించి ఉన్న అంగోస్త్రం అంచులు నీళ్ల తాకిడికి పైకి ఎగురుతున్నట్టుగా చూపించారు. ఆ అబ్జర్వేషన్ బాగుంది. 

మరి రాముడు ధరించిన యజ్ఞోపవీతం మాత్రం స్థిరంగా ఆయన దేహాన్ని అంటిపెట్టుకుని ఫిజిక్స్ సూత్రాలకు విరుద్ధంగా ఎలా ఉంటుంది. ఆయన జంధ్యం నూలుపోగులతో చేసినదే కదా. అయినా సరే.. అలా స్థిరంగా దిగువకే వేలాడుతూ స్థిరంగా ఉంటుంది. ఇది సరైన అబ్జర్వేషన్ లేని గ్రాఫిక్స్ లోపం. బుర్ర వాడకుండా.. కేవలనం టెక్నికల్ గా మాత్రమే చూసుకోవడం వల్ల జరిగే పొరబాటు ఇది. 

ఏదో ఆషామాషీగా కార్టూన్ నెట్వర్క్ లో వచ్చే యానిమేషన్ సినిమా అయితే.. ఏదోటి అని సర్దుకోవచ్చు. కానీ.. అలాంటి చిత్రాల్లో కూడా ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాంటిది.. ప్రభాస్ లాంటి అతిపెద్ద హీరోను తీసుకుని, రాముడిలాంటి భారతదేశానికి అత్యంత పెద్ద హీరో కథను.. ఒక అద్భుతప్రయోగంగా యానిమేషన్ రూపంలో సెల్యులాయిడ్ ఫార్మాట్ లో చెప్పాలని అనుకున్నప్పుడు.. వందల కోట్ల రూపాయలను అందుకోసం ఖర్చుపెడుతున్నప్పుడు.. అబ్జర్వేషన్ పరంగా మరెంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని క్షణాలు మాత్రమే ఉన్న టీజర్ లో ఇది చిన్నలోపమే కావొచ్చు. కానీ.. అబ్జర్వేషన్, శ్రద్ధ కొరవడితే.. మొత్తం సినిమాలో మరెన్ని లోటుపాట్లు దొర్లుతాయో? దర్శకుడు ఒక్కడూ ప్రతి విషయాన్నీ చూసుకోవాలని కాదు.. కానీ సినిమా అనేది టీమ్ వర్క్. టీమ్ లో ఎవరో ఒకరు గమనించాలి కద. 

అసలే ఆదిపురుష్ గ్రాఫిక్స్ పనితనంపై టీజర్ చూడగానే నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. మోషన్ కేప్చర్ పద్ధతిలో నటుల మొహాలను ఆ రామాయణ పాత్రలకు ముడిపెట్టగలిగారేమో గానీ.. యానిమేషన్ వర్క్ చాలా పేలవంగా ఉన్నదనే విమర్శలు వస్తున్నాయి. అసలే పనితనం గొప్పగా లేని యానిమేషన్‌కు, ఇలాంటి అబ్జర్వేషన్ లోపాలు కూడా తోడైతే సినిమా ఏమైపోతుంది? టీజర్ అనేది సినిమా మీద అంచనాలు పెంచేలా, మార్కెట్ పెంచేలా ఉండాలి గానీ.. ఎదురుచూసిన అభిమానుల్ని నీరసపరిచేలా తయారైతే ఎలాగ? అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా దిద్దుకోగలిగిన లోపాలను విడుదల లోగా దిద్దుకుంటే బాగుంటుంది. 

.. రాఘవ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?