ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బాటలో నడుస్తున్నారు. నిజానికి ఆయన తొలి నుంచి అదే బాటలో ఉన్నారు కదా.. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకి గానే చెలరేగుతున్నారు కదా! కెసిఆర్ సంకల్పిస్తున్న కొత్తకూటమిలో ఒక సభ్యుడిగా కావడానికి సుముఖంగానే ఉన్నారు కదా.. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ బాటలో నడవడం ఏమిటి అని అనుమానాలు వ్యక్తం చేస్తే కుదరదు?
దేశవ్యాప్తంగా తన పార్టీని విస్తరించే చర్యల్లో భాగంగా.. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల మీద దృష్టి పెట్టిన కేజ్రీవాల్.. అక్కడ మాటలు సంధించడంలో అనుసరిస్తున్న వైఖరి చూస్తే.. అచ్చంగా కేసీఆర్ బాటలో సాగుతున్నట్లు అభిప్రాయం కలుగుతుంది.
కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో వారి పరిశీలన, నివేదికల ప్రకారం గుజరాత్ లో విజయావకాశాలు ఆమ్ ఆద్మీ పార్టీకే ఉన్నాయని కేజ్రీవాల్ తాజాగా బయటపెట్టారు. సాధారణంగా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది కేంద్రంలోని ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. మరి వారు సేకరించిన పరిశోధనల నివేదిక కేజ్రీవాల్ కు ఎలా తెలుసు? అనే సందేహం కలగవచ్చు గానీ.. ఈ మాజీ సివిల్ సర్వీసెస్ అధికారికి అది అసాధ్యం కాకపోవచ్చు.
గెలుపు ఖచ్చితంగా కేజ్రీవాల్ దే అని ఆయన అంత బలంగా నమ్ముతున్నప్పుడు.. నిమ్మళంగా ఉండవచ్చు. కానీ.. ఆయన ఆ ఐబీ నివేదిక అనే మాటను తన ఎన్నికల ప్రచారానికే వాడుకుంటున్నారు. ఇంతకూ ఆయనకు తెలిసినది, ఆయన చెబుతున్నది.. నిజమో కాదో ఎవ్వరికీ తెలియదు.
అదంతా పక్కన పెడితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఆప్ గెలుస్తుందని ఐబీ నివేదిక చెబుతున్నదనేది కేజ్రీవాల్ మాటల సారాంశం. ఇధి మాయపూరితమైన మాట. ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది! ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తాము గెలుస్తాం అని, ఐబీ నివేదిక చూసి బిజెపి జడుసుకుని సంక్షేమ పథకాలు ప్రకటిస్తే.. ఎన్నికల్లోగా ఫలితం తేడా వస్తుందని మాట మార్చడానికి వీలుగా కేజ్రీ చెప్పిన సంగతి కనిపిస్తోంది.
మరో చిత్రమైన వ్యాఖ్యానం ఆయన చేస్తున్నారు. ఆప్ ను గెలవనీయకుండా గుజరాత్ లో బిజెపి- కాంగ్రెస్ రెండూ కుమ్మక్కు అయ్యాయట. కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో పది సీట్లు కూడా సాధించే సత్తా లేదట. కానీ ఎన్నికల్లో పోటీచేయడం ద్వారా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి.. బిజెపి మళ్లీ అధికారంలోకి రావడానికి సహకరించబోతున్నదట.
పరస్పరం ఉప్పూ నిప్పులాగా తలపడే ప్రత్యర్థులు అయిన బిజెపి– కాంగ్రెస్ ల గురించి వారిద్దరూ నన్ను ఓడించడానికే కుమ్మక్కు అయ్యారు.. కలిసి పనిచేస్తున్నారు.. అనే తరహా అర్థం పర్థం లేని మాటలు మరెక్కడైనా విన్నట్లుగా కనిపిస్తోంది. అవును మీరు అనుకుంటున్నది నిజమే. కేసీర్ నిత్యం ఆ మాట చెబుతుంటారు. తెలంగాణలో గులాబీదళాన్ని ఓడించడానికి వారు కుమ్మక్కయ్యారని అంటుంటారు.
అచ్చంగా కేసీఆర్ తరహాలోనే అరవింద్ కేజ్రీవాల్ కూడా.. తనను ఓడించడానికి వారిద్దరూ మిలాఖత్ అయ్యారనడం తమాషాగా ఉంది.