మూవీ రివ్యూ: పాగల్

టైటిల్: పాగల్ రేటింగ్: 2.25/5 తారాగణం: విష్వక్ సేన్, నివేతా పేతురాజ్, మేఘ లేఖ, సిమ్రాన్ చౌదరి, మురళి శర్మ తదితరులు కెమెరా: ఎస్. మణికందన్ ఎడిటింగ్: గ్యారీ  సంగీతం: రథన్, లియోన్ జేంస్ …

టైటిల్: పాగల్
రేటింగ్: 2.25/5
తారాగణం: విష్వక్ సేన్, నివేతా పేతురాజ్, మేఘ లేఖ, సిమ్రాన్ చౌదరి, మురళి శర్మ తదితరులు
కెమెరా: ఎస్. మణికందన్
ఎడిటింగ్: గ్యారీ 
సంగీతం: రథన్, లియోన్ జేంస్ 
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
దర్శకత్వం: నరేష్ కుప్పిలి
విడుదల తేదీ: 14 ఆగష్ట్, 2021

తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని పరితపిస్తూ, ఉన్నంతలో ఏదో ఒక వివాదాన్ని చేసి మీడియాలో నలిగే ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తున్న యువనటుడు విష్వక్ సేన్ ఇప్పుడు “పాగల్” గా మన ముందుకొచ్చాడు. 

జాతి రత్నాలు, ఎస్సార్ కళ్యాణ మండపం తర్వాత యంగ్ ఆడియన్స్ దృష్టిని తనవైపుకి తిప్పుకుని కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లోకొచ్చిన మరొక యూత్ ఫుల్ సినిమా ఇది. 

“పాగల్” టైటిల్, విశ్వక్ సేన్ హీరో అనగానే చాలా ఆశించి హాల్లోకి వచ్చే ఆడియన్స్ ఉంటారు. ఆ టైటిల్ కి తగ్గట్టుగా నిజానికి పిచ్చపిచ్చగా క్యారెక్టర్ ని రాసుకుని అతిశయోక్తి అలంకారంతో సినిమాకి కొత్తదనం తీసుకురావచ్చు. టైటిల్ “పాగల్” అని పెట్టారు కానీ నిజానికి ఇందులో హీరో పిచ్చివాడు కాదు అమాయకుడు. “ఇన్నోసెంట్” అనేది ఈ సినిమాకి కరెక్ట్ టైటిల్. 

చిన్నప్పుడే తల్లి (భూమిక) చనిపోతుంది. తనని ప్రేమించే వాళ్లు లేక అనాథయిపోతాడు ప్రేం (విష్వక్ సేన్). ఏ అమ్మాయైనా తనని ప్రేమిస్తే ఆమెను తల్లిలా చూసుకోవాలనుకుంటాడు. 

ఇలా మెలోడ్రామాతో టేకాఫ్ అయిన కథని హిలారియస్ గా నడిపే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అదేలా అంటే హీరో కనిపించిన ప్రతి అమ్మాయికి గులాబి పువ్వు ఇచ్చి ప్రేమిస్తావా అనడుగుతాడు. కొందరు లెంపకాయ కొట్టి వెళ్లిపోతారు, కొంతమంది నవ్వి ఊరుకుంటారు, కొందరు తమ బాయ్ ఫ్రెండ్స్ కి చెప్పి బెదరకొడతారు. 

మొత్తానికి ఒకమ్మాయి (మేఘ లేఖ) అతనికి కనెక్ట్ అవుతుంది. కానీ ఒక బలహీనమైన కారణంతో బ్రేకప్ చెబుతుంది. తర్వాత మరొక అమ్మాయి (సిమ్రాన్ చౌదరి) కనెక్ట్ అవుతుంది. ఆమెతో ఒకానొక కారణంతో హీరోనే బ్రేకప్ చేసుకుంటాడు. తర్వాత ఇంకో అమ్మాయి సీన్లోకొస్తుంది. ఆమెకి పెళ్ళి కుదిరిందని చెప్పి బ్రేకప్ చెబుతుంది. తర్వాత వినూత్నంగా ఉందనుకున్నారో ఏమో కాస్తంత గే టచ్ ఇస్తూ మురళీ శర్మతో కూడా హీరోకి లవ్ ట్రాక్ పెట్టారు. ఇది నచ్చినవాళ్లకి సినిమా మొత్తంలో ఇదే కామెడీ ట్రాక్. నచ్చనివాళ్లకి ఈ సినిమాలో ఇదే పెద్ద బ్లాక్ స్పాట్. 

అసలీ మురళీ శర్మ ఎవరు? లవ్వంటూ మన హీరో అతని వెంట ఎందుకు పడ్డాడు? ఈ ప్రశ్నలకి జవాబు సెకండాఫ్ లో ఉంటుంది. అక్కడొక అమ్మాయి తీర (నివేతా పెతురాజ్) ఉంటుంది. ఆమె అనుకోకుండా రోడ్డు మీదున్న హీరోకి గట్టిగా అరిచి “ఐ లవ్యూ” చెబుతుంది. ఆమెతో అసలు లవ్ ట్రాక్ అన్నమాట. ఇంతకీ ఈ తీర ఎవరు? దీనికి బోలెడన్ని సినిమాటిక్ లిబెర్టీస్ తీసుకుని దానినే ట్విస్ట్ అనుకోమన్నారు. 

ఆద్యంతం దర్శకుడికి అనుకూలంగా సన్నివేశాల్ని కల్పించేసుకుని బలవంతంగా ప్రేక్షకుల మీద రుద్దినట్టుంది తప్ప ఎక్కడా స్క్రిప్టులో ఇంటిలిజెన్స్ ప్రదర్శించలేదు. లాజిక్, రీజనింగ్ అస్సలు వాడకుండా ఎదో చిన్నపిల్లలాటలా నడింపించేసారు స్క్రీన్ ప్లేని. 

ఫస్టాఫ్ అంతా ఒకే రకమైన ట్రాకులు నాలుగు. అంటే కథ ఎక్కడికీ వెళ్లదు. అక్కడే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ట్రాక్, క్లైమాక్స్ లో ఒక ప్రెడిక్టిబుల్ సమస్య, క్లైమాక్స్ లో అంతకన్నా ఈజీగా ఊహించగలిగే ముగింపు. ఇదీ మొత్తమ్మీద ఈ సినిమా గ్రాఫ్. టెక్నికల్ గా రెండు మూడు పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంత సాగతీత సినిమాని కూడా కాస్తంత భరించేలా చేసింది. కెమెరా వర్క్ బాగుంది. 

ఎడిటింగ్ పూర్. ఇదెలా చెప్పగలరు అంటే..చూసిన సీన్లే చూస్తున్న ఫీలింగ్ రావడం, కథనానికి పెద్దగా ఉపయోగం లేని సీన్స్ చూసి విసుగు చెందడం. ఉదాహరణకి పిట్టగోడ బ్యాచ్ ని హీరో కొట్టే సీన్స్ రెండు సార్లైతే ఓకే. మళ్లీ మళ్లీ చూడడం వల్ల నీరసం వస్తుంది. కామెడీకి అవసరం అనుకుంటే వాటిని క్రిస్ప్ చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

విష్వక్ సేన్ నటనలో ఈజ్ ఉంది. నివేతా పేతురాజ్ ఆకర్షణీయంగా పక్కింటమ్మాయి లుక్ లో ఉంది. మురళీశర్మది పెద్దగా గ్రావిటీ లేని పాత్ర. మిగిలిన నటీనటులంతా జస్ట్ ఓకే. ప్రతి చిత్రానికి టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. ఈ చిత్రం యంగ్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికే తీసారు. 

“తెర మీద ఏది వడ్డించినా వంక పెట్టకుండా తింటాం..ఇది కూడా ఒకరకమైన టేస్ట్ అనుకుంటాం..కళ్లని తప్ప మైండ్ ని అస్సలు వాడం..హాలుకెళ్లి సినిమా చూడ్డమే మాకు కావలసింది” అనుకునే యంగ్ ఆడియన్స్ చాలామందే ఉంటారు. వాళ్ళే ఇలాంటి సినిమాకి మహారాజపోషకులు. 

అటువంటి వాళ్ల కోసం సినిమా తీసి ఓపెనింగ్స్ బాగా వస్తే పాసైపోయినట్టే అనుకోవచ్చు. కానీ విశ్లేషణ చేసినప్పుడు లాజిక్, మేజిక్, ఇంటిలిజెన్స్, కామన్ సెన్స్ ఇలా చాలా అంశాలు పరిగణనలోకి వస్తాయి. ఈ నాలుగిట్లో ఏదీ ఈ సినిమాలో కనపడదు కనుక రివ్యూ పరంగా దీనికి థంబ్స్ డౌన్ మాత్రమే చెప్పాలి. 

బాటం లైన్: విషయం లేని అమాయకుడి కథ